రైతుల ఆందోళనలపై స్పందించిన కేంద్రం

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు కొన్నిరోజులుగా చేపడుతున్న ఆందోళనలపై కేంద్రం స్పందించింది. రైతులతో చర్చలు జరిపేందుకు, వారి సమస్యలను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. డిసెంబర్ 3లోగా వారితో చర్చలు జరిపేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. రైతులంతా వారి ఆందోళన కోసం ఢిల్లీ పోలీసులు సూచించిన నిరంకారీ సమాగం మైదానానికి వెళ్లాలని విజ్ఞప్తి చేశారు.
మరోవైపు రైతుల ఆందోళన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వ్యవసాయ వ్యతిరేక చట్టాలను రద్దు చేసే వరకు తమ పోరాటం ఆపబోమని ఆయన స్పష్టం చేశారు. అన్యాయానికి వ్యతిరేకంగా గళం వినిపించడం నేరం కాదని.. రైతులపై నకిలీ కేసుల నమోదు చేసినంత మాత్రాన మోదీ ప్రభుత్వం రైతుల బలమైన అభిప్రాయాలను మార్చలేదన్నారు.
ఇటు హర్యానా సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్ రైతులకు క్షమాపణలు చెప్పేంత వరకు తాను ఆయనతో మాట్లాడబోనని పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ తేల్చి చెప్పారు. తమ రైతులను వేర్పాటువాదులతో పోల్చడం సరికాదన్నారు. పంజాబ్ రైతులకు క్షమాపణలు చెప్పే వరకు ఖట్టర్ తో మాట్లాడను.. ఆయనను క్షమించను అని ఆగ్రహం వ్యక్తంచేశారు.
అంతకు ముందు రైతుల ఆందోళనల నేపథ్యంలో హర్యానా ముఖ్యమంత్రి ఖట్టర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రైతుల ప్రదర్శనలో 'ఖలిస్థాని' వేర్పాటు వాదులున్నట్లు తమకు సమాచారం అందిందని చెప్పారు. ఈ విషయంలో తమకు కచ్చితమైన ఇంటెలిజెన్స్ నివేదికలు అందాయని పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com