రైతుల ఆందోళనల నేపథ్యంలో విషాద ఘటన

కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దులో రైతుల చేస్తున్న ఉద్యమం కొనసాగుతోంది. ఈ మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలంటూ వేలాదిమంది రైతులు రాజధాని సరిహద్దు ప్రాంతాల్లో ఆందోళన చేస్తున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాలు ఆదివారం సింఘు సరిహద్దును సందర్శించారు. అక్కడ ఢిల్లీ ప్రభుత్వానికి చెందిన పంజాబ్ అకాడమీ నిర్వహించిన కీర్తన్ దర్బార్‌లో పాల్గొన్నారు.
కేంద్ర ప్రభుత్వ నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రోజుకో రీతిలో నిరసన తెలుపుతున్న రైతులు ఆదివారంనాడు మోదీ 'మన్ కీ బాత్' సమయంలో వినూత్న నిరసన తెలిపారు. రైతుల మనసులో మాట వినండంటూ ప్రధాని ప్రసంగం చేస్తున్నంత సేపూ భోజనం పళ్లాలను మోగించి నిరసన తెలిపారు. తద్వారా మోదీ మనసులో మాట తమకు చేరలేదనే సందేశం పంపారు.
రైతుల ఆందోళనల నేపథ్యంలో ఆదివారంనాడు విషాద ఘటన చోటుచేసుకుంది. రైతులు ఆందోళన సాగిస్తున్న తిక్రి సరిహద్దుకు కొద్ది కిలోమీటర్ల దూరంలో పంజాబ్‌కు చెందిన ఒక లాయర్ విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని పంజాబ్‌లోని ఫజిల్కా జిల్లాలోని జలాలాబాద్‌కు చెందిన అమర్‌జిత్ సింగ్‌గా గుర్తించారు.
ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు నెల రోజులుగా ఆందోళన చేస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ వ్యక్తిగత పనిపై ఇటలీ పర్యటనకు వెళ్లారు. పలు విపక్ష పార్టీలు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను ఉపసంహరించాలని రైతుల చేస్తున్న ఆందోళనకు మద్దతు తెలుపడంతోపాటు కేంద్రంపై ఒత్తిడి పెంచుతున్న తరుణంలో రాహుల్ విదేశీ పర్యటనకు వెళ్లడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com