శాంతియుతంగా దీక్షలను చేస్తున్న మమ్మల్ని ఖాళీచేయిస్తే ఇక్కడే ఉరివేసుకుంటాం : రైతులు

ఢిల్లీ సరిహద్దుల్లోని ఘాజీపూర్ వద్ద పరిస్థితి ఉద్రిక్తతంగా మారింది. రైతులను వెంటనే ఖాళీ చేయించాలని యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ చేసిన ఆదేశాలు ఉద్రిక్తతకు దారితీశాయి. సీఎం ఆదేశాలతో రంగంలోకి దిగిన యూపీ పోలీసులు.. ఘూజీపూర్ వద్ద దీక్షలు చేస్తున్న రైతుల వద్దకు వెళ్లారు. వారు ఖాళీ చేయకపోవడంతో బలవంతంగా ఖాళీ చేయించే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు, రైతు సంఘాల మధ్య తోపులాట జరిగింది. రైతులపై దాడి చేయవద్దంటూ భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేష్ తికాయత్ కన్నీళ్ల పర్యంతమయ్యారు. మూడు చట్టాలను రద్దు చేసే వరకు ఘాజీపూర్ ఖాళీ చేయబోమని చెప్పారు. శాంతియుతంగా దీక్షలను చేస్తున్న తమని ఖాళీచేయిస్తే ఇక్కడే ఉరివేసుకుంటామని రైతులు తేల్చిచెప్పారు.
బీజేపీ ప్రభుత్వం తమను హతమార్చేందుకు కుట్రలు పన్నుతోందని రాకేశ్ తికాయత్ ఆరోపించారు. బుల్లెట్లు దిగినా ఫర్వాలేదుగాని భయపడి పారిపోయేదిలేదని తెగేసి చెప్పారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఘాజీపూర్ వద్ద పెద్ద ఎత్తున కేంద్ర, యూపీ బలగాలు చేరుకుంటున్నాయి. రైతులు రహదారులను దిగ్బంధించడం వల్ల తమకు అసౌకర్యం కలుగుతోందంటూ స్థానికులు ఆందోళన చేయడంతో యూపీ ప్రభుత్వం.. రైతులను బలవంతంగా పంపించేస్తోంది.
అటు.. గణతంత్ర దినోత్సవం రోజున ఢిల్లీ ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా చోటుచేసుకున్న ఘటనలపై పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఇందులో భాగంగా, ఎర్రకోట ఘటనను తీవ్రంగా పరిగణించిన అధికారులు, ఆ ఘటనకు సంబంధించి తాజాగా దేశద్రోహం కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 124A ప్రకారం కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, దర్యాప్తు జరుపుతున్నట్లు వెల్లడించారు.
అయితే, ఎర్రకోట ఘటనకు సంబంధించి ఇప్పటికే పంజాబీ నటుడు దీప్ సిద్ధూ, గ్యాంగ్‌స్టర్ నుంచి సామాజిక కార్యకర్తగా మారిన లఖాసిధానాలపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. మరోవైపు.. ఢిల్లీలో హింసాత్మక ఘటనలకు కారణమైనందుకు న్యాయపరమైన చర్యలు ఎందుకు తీసుకోకూడదో తెలపాలంటూ దాదాపు 20 రైతు సంఘాల నాయకులకు పోలీసులు నోటీసులు పంపించారు. వీటిపై మూడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని సూచించారు. అంతేకాకుండా కేసులు నమోదైన రైతు సంఘాల నాయకుల పాస్‌పోర్టులను సరెండర్ చేయాలని ఆదేశించిన పోలీసులు, వారిపై లుక్‌ఔట్ నోటీసులు జారీ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com