దిగిరాని కేంద్రం.. పట్టువీడని రైతులు.. ఏడో సారి చర్చల్లోనూ దొరకని పరిష్కారం

దిగిరాని కేంద్రం.. పట్టువీడని రైతులు.. ఏడో సారి చర్చల్లోనూ దొరకని పరిష్కారం
40 రైతు సంఘాలకు చెందిన ప్రతినిధులతో ముగ్గురు కేంద్రమంత్రులు మూడు గంటల పాటు చర్చలు జరిపారు.

సాగు చట్టాలపై ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. కేంద్రం దిగిరావట్లేదు.. రైతులు పట్టువీడట్లేదు. కేంద్రం, రైతు సంఘాల నేతల మధ్య ఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో జరిగిన ఏడో సారి చర్చల్లోనూ ఎలాంటి పరిష్కారం దొరకలేదు. దీంతో ఈ సారి కూడా చర్చలు అసంపూర్తిగానే ముగిశాయి. 40 రైతు సంఘాలకు చెందిన ప్రతినిధులతో ముగ్గురు కేంద్రమంత్రులు నరేంద్ర సింగ్‌ తోమర్‌, పీయూష్‌ గోయల్‌, సోం ప్రకాశ్‌లు దాదాపు మూడు గంటల పాటు చర్చలు జరిపారు. సాగు చట్టాల రద్దు, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలంటూ రైతులు పట్టుబడుతుండగా.. కేంద్రం ససేమిరా అనడంతో చర్చలు మరోసారి అసంపూర్తిగానే ముగిశాయి. దీంతో జనవరి 8న మరోసారి భేటీ కావాలని నిర్ణయించారు.

చర్చల అనంతరం రైతు సంఘాల నేతలు మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రంతో చర్చల్లో తొలిసారి పురోగతి కనిపిస్తోందన్నారు. చట్టాల రద్దుకు ప్రత్యామ్నాయం లేదా? అని కేంద్రమంత్రులు అడిగారని తెలిపారు. చట్టాల రద్దు తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని తాము తేల్చిచెప్పామన్నారు. కేంద్రంతో మాట్లాడి తదుపరి చర్చలకు వస్తామని మంత్రులు చెప్పారన్నారు. దీనిపై తాము సమావేశమై భవిష్యత్తు కార్యాచరణపై చర్చిస్తామని రైతు సంఘాల నేతలు తెలిపారు. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయడం, కనీస మద్దతు ధర కల్పించడమే తమ ప్రధాన డిమాండ్లు అని రైతు నేతలు పేర్కొంటున్నారు.

ప్రభుత్వంపై చాలా ఒత్తిడి ఉందని ఏఐకేఎస్‌ ప్రధాన కార్యదర్శి హన్నాన్‌ మొల్లా అన్నారు. మూడు చట్టాలను రద్దుచేయడమే తమ ప్రధాన డిమాండ్‌ అని అందరు నేతలు కేంద్రానికి చెప్పారన్నారు. మూడు చట్టాల రద్దుపై తప్ప మరే అంశంపైనా తాము చర్చలకు సిద్ధంగా లేమన్నారు. వీటిని రద్దు చేసేదాకా నిరసనల నుంచి వెనక్కి తగ్గేదిలేదని తేల్చి చెప్పారు.


Tags

Next Story