రైతుల ఆందోళనపై పార్లమెంట్‌లో చర్చకు విపక్షాల పట్టు

రైతుల ఆందోళనలపై చర్చ చేపట్టాల్సిందేనని పార్లమెంట్ లో విపక్షాలు పట్టుబట్టాయి. వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలన్న డిమాండ్ పై విపక్షాలు లోక్ సభలో వాయిదా తీర్మానం నోటీస్ ఇచ్చాయి. కాంగ్రెస్, శిరోమణి అకాలీ దళ్, ఆర్ఎస్పీ, సీపీఎం పార్టీలు చర్చకు డిమాండ్ చేశాయి. శివసేన ఎంపీలు సైతం రిపబ్లిక్ డే నాడు రైతుల ట్రాక్టర్ల ర్యాలీ సందర్భంగా చోటు చేసుకున్న హింసపై చర్చ జరపాలని వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చారు. అయితే స్పీకర్ ఓం బిర్లా చర్చకు అనుమతి ఇవ్వకపోవడంతో విపక్షాలు ఆందోళన చేపట్టాయి.
అటు రాజ్యసభలోనూ విపక్షాలు రైతుల ఆందోళనలపై చర్చ జరపాలని డిమాండ్ చేశాయి. చైర్మన్ వెంకయ్యనాయుడు ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని మొదలు పెట్టగా.. ప్రతిపక్ష సభ్యులు సభలో ఆందోళకు దిగారు. రైతుల ఆందోళనలకు మద్దతుగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అయితే రాష్ట్రపతి ప్రసంగంపై లోక్ సభలో తొలుత చర్చ ప్రారంభం కావాల్సి ఉన్నందున.. ఈ అంశంపై బుధవారం చర్చిద్దామని వెంకయ్య సభ్యులకు సూచించారు. దీంతో చైర్మన్ తీరుకు నిరసనగా విపక్ష సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com