సాగు చట్టాలపై వెనక్కి తగ్గేదే లేదు.. రైతులు, కేంద్రం మధ్య ఆరో విడత చర్చలు

సాగు చట్టాలపై వెనక్కి తగ్గేదే లేదు.. రైతులు, కేంద్రం మధ్య ఆరో విడత చర్చలు
అటు కేంద్రంగాని, ఇటు రైతులు గాని ఎక్కడా వెనక్కి తగ్గేట్లు కనిపించడం లేదు.

సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న రైతులతో బుధవారం చర్చలు జరపనుంది కేంద్రం. పేరుకే చర్చలు తప్ప.. అటు కేంద్రంగాని, ఇటు రైతులు గాని ఎక్కడా వెనక్కి తగ్గేట్లు కనిపించడం లేదు. మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవడంపై మాత్రమే చర్చిస్తామని రైతులు స్పష్టంగా చెబుతున్నారు. సవరణలతో సరిపెట్టడం తమకు ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని రైతు సంఘాలు నిన్ననే కేంద్రానికి లేఖ రాశాయి. మూడు చట్టాల రద్దు, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత, దేశ రాజధాని ప్రాంతంలో వాయు కాలుష్యానికి సంబంధించి జారీ చేసిన ఆర్డినెన్స్‌లో సవరణలపై మాత్రమే చర్చిస్తామని రైతు సంఘాలు తేల్చి చెప్పాయి.

కేంద్రం మాత్రం సాగు చట్టాలను రద్దు చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించేది లేదని కూడా స్పష్టం చేసింది. ఈ నేపధ్యంలో ఆరోవిడత చర్చలు ఏ విధంగా సాగుతాయన్న విషయంపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటి వరకు కేంద్రం, రైతు సంఘాల మధ్య ఐదుసార్లు చర్చలు జరిగినప్పటికీ.. ఎటువంటి పరిష్కారం లభించలేదు. కేంద్రం కూడా చర్చల్లో ఎలా వ్యవహరించాలనే విషయమై వ్యూహాన్ని ఖరారు చేసింది. కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్‌ తోమర్‌, పీయూష్‌ గోయల్‌, సోం ప్రకాశ్‌.. నిన్న హోంమంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యారు. అయితే సమావేశం వివరాలేవీ బయటకు రాలేదు.

మరోవైపు రైతుల ఉద్యమం ఉద్ధృతం అవుతోంది. ఇవాళ కేంద్రంతో చర్చలు ఉండడంతో.. నేడు చేపట్టాల్సిన ట్రాక్టర్ల ర్యాలీని రేపటికి వాయిదా వేశారు. నిన్న బిహార్‌ రాజధాని పట్నాలో వేలమంది రైతులు, వామపక్షాల కార్యకర్తలు రాజ్‌భవన్‌ దిశగా కదం తొక్కారు. మధ్యలో పోలీసులు అడ్డుకొని లాఠీచార్జి చేశారు. పంజాబ్‌లో రిలయన్స్‌ టవర్ల మీద రైతుల దాడులు కొనసాగుతున్నాయి. నిన్న కూడా 63 టవర్లు ధ్వంసం చేశారు.


Tags

Read MoreRead Less
Next Story