దేశవ్యాప్తంగా రైతు సంఘాల రైల్ రోకో

దేశవ్యాప్తంగా రైతు సంఘాల రైల్ రోకో

కేంద్ర వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ.. ఢిల్లీలో ఆందోళనలు చేస్తున్న రైతు సంఘాలు ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తున్నాయి. ఇందులో భాగంగా... ఈ రోజు మధ్యాహ్నం 12 నుంచి 4 గంటల వరకు దేశవ్యాప్తంగా రైల్‌రోకో నిర్వహించడానికి సంయుక్త కిసాన్‌ మోర్చా సిద్ధమైంది. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడడానికి రైల్వే పరిరక్షణ ప్రత్యేక దళం- RPSF అప్రమత్తమైంది. సుమారు 20 వేల మందిని దేశవ్యాప్తంగా మోహరించింది. పంజాబ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, హరియాణా, పశ్చిమబెంగాల్‌లపై ప్రత్యేక దృష్టి సారించింది రైల్వే భద్రతాదళం. నిరసనలు శాంతియుతంగా తెలపాలని, దీనిపై జిల్లా యంత్రాంగాలతో సమన్వయంతో వెళ్లనున్నామని ఆర్‌పీఎఫ్‌ డైరెక్టర్‌ జనరల్‌ అరుణ్‌కుమార్‌ తెలిపారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి కంట్రోల్‌రూం ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

సాగు చట్టాలను నిరసిస్తూ... రిపబ్లిక్ డే రోజున... రైతుల సంఘాలు చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ఎర్రకోట వద్ద కొందరు మతపరమైన జెండాను ఆవిష్కరించడంతోపాటు.. పలు చోట్ల హింసాత్మక ఘటనలు జరిగాయి. ఈ నేపథ్యంలో... నేడు జరిగే రైల్‌ రోకోపై పోలీసులు ప్రత్యేక దృష్టిపెట్టారు. ఎలాంటి అల్లర్లు, ఘర్షణలు జరగకుండా భద్రతను పెంచారు. మరోవైపు ఎర్రకోట వద్ద చోటు చేసుకున్న ఘటనల్లో మరొకరిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. మణీందర్‌ సింగ్‌ అనే ఈ వ్యక్తి తన వద్దనున్న నాలుగున్నర అడుగుల కత్తులను తిప్పుతూ నిరసనకారులను రెచ్చగొట్టినట్లు పోలీసులు అంటున్నారు. మరోవైపు రైతు సంఘాలు మాత్రం... సాగు చట్టాలను రద్దు చేసేవరకు ఆందోళనలు కొనసాగిస్తామంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గేదిలేదని.. రైతు సంఘాల నేత రాకేశ్ టికాయత్‌ అన్నారు.

మూడు కేంద్ర సాగు చట్టాలను రద్దు చేయాలంటూ.. ఢిల్లీ శివార్లలో దాదాపు రెండు నెలల నుంచి రైతులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకు 11 దఫాలుగా కేంద్రంతో చర్చలు జరిపినప్పటికీ ఎలాంటి పురోగతి కనిపించలేదు. మరోవైపు.. రైతుల సమస్యలతో చర్చించేందుకు సుప్రీం కోర్టు కూడా ఓ కమిటీని నియమించింది. అయితే.. కమిటీలతో ఎలాంటి ఉపయోగం లేదని... సాగు చట్టాలను రద్దు చేయాల్సిందేనని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అటు... ఢిల్లీ సరిహద్దుల్లో నిరసన చేస్తున్న ఓ రైతు నాయకుడిని హత్య చేసేందుకు అంతర్జాతీయ కుట్ర జరిగిందని కేంద్ర నిఘా సంస్థలు ఓ నివేదికలో పేర్కొన్నాయి. దీని వెనుక ఖలిస్థాన్‌ కమాండో ఫోర్స్‌- KCF ఉందని తెలిపాయి. బెల్జియం, బ్రిటన్‌లకు చెందిన కుట్రదారులు.. ఈ నాయకుడిని అంతం చేయాలని చూస్తున్నారని నిఘా సంస్థలు పేర్కొన్నాయి.


Tags

Read MoreRead Less
Next Story