రైతుల ట్రాక్టర్ ర్యాలీలో అలజడికి పాక్ కుట్రలు!

కొత్త వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ రైతులు చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీలో అలజడికి పాక్‌లో కుట్ర జరిగినట్లు తెలుస్తోంది. ఇందుకోసం మొత్తం 300 ట్విటర్ ఖాతాలు సృష్టించారని నిఘా సంస్థలు గుర్తించాయి. దీంతో రైతుల ర్యాలీకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు ఢిల్లీ పోలీసులు. రాజ్‌పథ్ పరిసర ప్రాంతాల్లో భారీగా బలగాలను మోహరించారు.
ట్రాక్టర్ల ర్యాలీకి మొత్తం 37 షరతులతో అనుమతి ఇచ్చారు ఢిల్లీ పోలీసులు. మధ్యాహ్నం 12.00 నుంచి సాయంత్రం 5.00 వరకు ర్యాలీకి అనుమతి ఇచ్చారు. 5వేల ట్రాక్టర్లు, 5వేల మంది రైతులకే పర్మిషన్ ఇచ్చారు. అంబులెన్సులు, అత్యవసర వాహనాల కోసం ఒక లైన్ వదిలేయాలని, అభ్యంతరకర పోస్టర్లు, బ్యానర్లు పట్టుకోరాదని తెలిపారు. పేలుడు పదార్థాలు, ఆయుధాలు కలిగి ఉండరాదని, అనుమతించిన రూట్లో మాత్రమే ర్యాలీ నిర్వహించాలని, ధర్నాలు, రోడ్లపై బైఠాయించకూడదని షరతులు విధించారు. మార్గమధ్యంలో కొత్త ట్రాక్టర్లను చేర్చుకోరాదని తెలిపారు.
రైతుల ట్రాక్టర్ ర్యాలీలో అలజడులు సృష్టించేందుకు ఈ నెల 13 నుంచి 18 మధ్య పాకిస్థాన్‌లో 300 ట్విటర్ ఖాతాలు సృష్టించినట్లు గుర్తించారు పోలీసులు. ప్రజలను తప్పుదోవ పట్టించాలన్న ఉద్దేశంతో వీటిని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. సవాలుతో కూడినప్పటికీ కట్టుదిట్టమైన భద్రత నడుమ ట్రాక్టర్ ర్యాలీ జరుగుతుందని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు.
గణతంత్ర దినోత్సవానికి ఏమాత్రం ఆటంకం కలగకుండా ర్యాలీ నిర్వహించుకోవాలని రైతులకు సూచించారు. రైతుల ట్రాక్టర్ల ర్యాలీ సందర్భంగా ఢిల్లీలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఢిల్లీలోని ఐటీవో, యమునా బ్రిడ్జి పలు ప్రాంతాల్లో పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేశారు. ట్రాక్టర్ల ర్యాలీ టిక్రీ, సింగూ, ఘాజీపూర్ సరిహద్దుల మీదుగా వచ్చి కంజావాలా, బవానా, ఆచుండీ, కేఎంపీ వేల మీదుగా సింగూ సరిహద్దుకు తిరిగి వెళతాయని ఢిల్లీ స్పెషల్ పోలీసు కమిషనర్ దీపేంద్ర పాఠక్ చెప్పారు.
మరోవైపు.. రైతుల ట్రాక్టర్ల ర్యాలీ సింగు సరిహద్దుల నుంచి ప్రారంభమైంది. ట్రాక్టర్లపై త్రివర్ణ పతాకాలను రెపరెపలాడిస్తూ చిల్లా సరిహద్దుల మీదుగా ఢిల్లీ -నోయిడా లింకు రోడ్డులోకి ప్రవేశిస్తున్నారు రైతులు. పెద్ద సంఖ్యలో ట్రాక్టర్లు, కార్లలతో.. ఢిల్లీ వెైపుగా వెళ్తున్నారు రైతులు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com