ఢిల్లీలో ఉద్యమాన్ని ఉధృతం చేసిన రైతులు !

ఢిల్లీలో ఉద్యమాన్ని ఉధృతం చేసిన రైతులు !
ప్రభుత్వం రైతు సంఘాలతో ఏడుసార్లు చర్చలు జరిపింది. కానీ చట్టాల రద్దుకు రైతు సంఘాలు పట్టుబట్టడంతో అవన్నీ విఫలమయ్యాయి.

ఢిల్లీ ఛలో అనే ర్యాలీకి హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి రైతులు ట్రాక్టర్లతో తరలివచ్చారు. ఢిల్లీ సరిహద్దుల్లోని సింగు, టిక్రి, ఘాజీపూర్‌తోపాటు హర్యానాలోని రేవసాన్ ప్రాంతాల నుంచి ట్రాక్టర్లు బయలు దేరాయి. ఈస్టర్న్, వెస్టర్న్ ఎక్స్‌ప్రెస్‌ హైవేల పైనుంచి దూసుకెళ్లిన ట్రాక్టర్లు మధ్యలో కలుసుకున్నాయి. ఈ భారీ ర్యాలీలో దాదాపు 3 వేల 500 ట్రాక్టర్లు పాల్గొన్నట్లు పోలీసులు అంచనా వేశారు. ట్రాక్టర్ మార్చ్ నిర్వహించడం వెనుక మరో కారణం ఉందంటున్నాయి రైతు సంఘాలు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26న భారీ ర్యాలీ నిర్వహించ తలపెట్టాయి రైతు సంఘాలు. దానికి రిహార్సల్స్‌గా ఈ ట్రాక్టర్ ర్యాలీ ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.

కొత్త వ్యవసాయ చట్టాలను రైతులు వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వం రైతు సంఘాలతో ఏడుసార్లు చర్చలు జరిపింది. కానీ చట్టాల రద్దుకు రైతు సంఘాలు పట్టుబట్టడంతో అవన్నీ విఫలమయ్యాయి. ప్రభుత్వం మాత్రం చట్టాల రద్దుకు అంగీకరించడం లేదు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఎనిమిదోసారి రైతు సంఘాలతో ప్రభుత్వం చర్చలు జరుపనుంది. కనీస మద్ధుతు ధరపై కేంద్రం నుంచి హామీని కోరుతున్నాయి రైతు సంఘాలు. ఇక ఏ ఉద్యమానికైనా నాయకుడంటూ ఉంటారు. కానీ రైతుల ఈ పోరాటానికి ప్రత్యేకంగా ఒక నాయకుడంటూ లేరు. రైతు సంఘాలే ముందుండి కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నాయి.

కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు చలి, వానను లెక్కచేయకుండా 43 రోజులుగా దీక్ష చేస్తున్నారు. చలిగాలులు, వాన నుంచి కాపాడుకునేందుకు రైతులు 25 బస్సులను, పెద్ద టర్పలిన్ షీట్లను వాటిపై గుడారాలుగా ఉపయోగిస్తున్నారు. ఈ బస్సులు ఢిల్లీ సిఖ్ గురుద్వారా మ్యానేజ్మెంట్ కమిటీ నిర్వహిస్తున్న స్కూలుకు సంబంధించినటువంటివి. ఈ బస్సుల్లోని సీట్లను తొలగించి వాటినే గుడారాలుగా మలుచుకున్నారు. ఒక్కో బస్సులో పదిమంది నిద్రించే వీలుంది. ఇక ఒక ఏసీ బస్సును మహిళల కోసం ఉపయోగిస్తున్నారు. కొత్త వ్యవసాయ చట్టాలకు సంబంధించి రైతు సంఘాలు ఇప్పటికే సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. అయితే ఈ కేసు ఈ నెల 11న విచారణకు రానుంది.

Tags

Next Story