రేపటి నుంచి టోల్ ప్లాజాల వద్ద ఫాస్టాగ్ అమలు

రేపటి నుంచి అన్నిటోల్ ప్లాజాల్లో నగదు రహిత చెల్లింపు పద్దతి అమలుకానుంది. ఇక పూర్తిస్థాయిలో టోల్ ప్లాజాలు ఫాస్టాగ్ లోకి మారనున్నాయి. దీంతో సోమవారం నుంచి అన్ని టోల్ ప్లాజాలవద్ద ఫాస్టాగ్ పద్దతిని అమలు చేసేందుకు చర్యలు చేపట్టారు. అయితే ఈ ఏడాది జనవరి ఒకటో తేదీ నుంచి ఈ విధానాన్ని అమలుచేయాలని కేంద్ర ప్రభుత్వం భావించింది. వాహనదారులకు మరింత గడువు ఇచ్చే ఉద్దేశంతో ఫిబ్రవరి 15వరకు పొడిగించింది. కేంద్ర జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఇచ్చిన గడువు ఈ రోజు రాత్రితో ముగియనుంది.
అయితే రాష్ట్రంలో రాకపోకలు సాగించే వాహనాల్లో 82శాతం వెహికిల్స్‌కు ఫాస్టాగ్ ఉన్నట్లు అధికారులు తెలిపారు. తెలంగాణ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లేజాతీయ రహదారుల్లో 21 టోల్ ప్లాజాలు ఉన్నాయి. ఫాస్టాగ్ విధానాన్ని గత సంవత్సర కాలంనుంచి అమలు చేస్తోంది. దీనితోపాటు టోల్ ప్లాజాల వద్ద నగదుతో కూడిన వరుసను ఏర్పాటుచేసి ఇన్నాళ్లు అనుమతి ఇచ్చారు.
ఇప్పటివరకు టోల్ ప్లాజా దాటిన తర్వాత ఫాస్టాగ్ కౌంటర్లు ఉండేవి. ఇకనుంచి వాటిని అన్నిచోట్ల టోల్ ప్లాజాలకు రావడానికి ముందే విక్రయ కేంద్రాలను ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. ఇందుకోసం అదనపు సిబ్బందిని కూడా ఏర్పాటుచేసినట్లు వెల్లడించారు. ఇకపై రాష్ట్రంలోని అన్ని టోల్ ప్లాజాలు, రాష్ట్రసరిహద్దులోని జాతీయ రహదారులపై ఉన్న టోల్ ప్లాజాల వద్ద సోమవారం నుంచి ఫాస్టాగ్ ను పటిష్టంగా అమలు చేయనున్నట్లు అధికారులు స్పష్టంచేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com