Uttarakhand Floods: ఉత్తరాఖండ్ వరదల్లో చిక్కుకున్న అయిదుగురు నగరవాసులు..

Uttarakhand Floods (tv5news.in)
Uttarakhand Floods: ఉత్తరాఖండ్‌లో చిక్కుకుపోయారు హైదరాబాద్‌కు చెందిన ఐదుగురు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు. దసరా సెలవుల సందర్భంగా విహార యాత్రకు వెళ్లారు. అయితే.. అకస్మాత్తుగా ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు వచ్చాయి. దీంతో లెమన్ ట్రీ ప్రాంతంలో చిక్కుకుపోయారు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు. నాలుగు రోజులుగా ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
ఓ బిల్డింగ్ మూడో అంతస్తులో ఉండిపోయామని తల్లిదండ్రులకు ఫోన్ చేశారు. దీంతో వారు ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు దృష్టికి తీసుకెళ్లారు. అక్కడి అధికారులతో మాట్లాడారు ఎమ్మెల్యే. అయితే.. క్షేమంగా బస్సులో పంపిస్తున్నామని తెలిపారు అక్కడి అధికారులు. ఉత్తరాఖండ్ వణుకుతోంది. భారీవర్షాలకు నదులన్నీ ఉగ్రరూపం దాల్చి ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ఎక్కడికక్కడ పరిస్థితి భీతావహంగా ఉంది.
ఇప్పటికి వరదల్లో ఐదుగురు చనిపోయినట్టు అధికారికంగా ప్రకటించారు. అటు, ప్రధాని మోదీ ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీతో ఫోన్‌లో మాట్లాడారు. సహాయ చర్యలపై ఆరా తీశారు. ఇవాళ కూడా భారీవర్షాలు కురుస్తాయనే వాతావరణ శాఖ హెచ్చరికలతో జనం బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. పలు చోట్ల వర్షాలకు కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో చార్‌ధామ్ యాత్రను ఉత్తరాఖండ్ ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది.
హరిద్వార్, రిషికేష్‌కి వచ్చిన చార్‌ధామ్ యాత్రికులు వాతావరణం మెరుగుపడే వరకు ముందుకు వెళ్లవద్దని రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించింది. మూడు రోజులుగా ఎడతెగని వర్షం కారణంగా.. చంపావత్‌లో చల్తీ నది వరదలకు నిర్మాణంలోని బ్రిడ్జ్ కొట్టుకుపోయింది. హల్ద్వానీలోని గౌలా నది కూడా ఉప్పొంగడంతో బ్రిడ్జ్ రోడ్డు దారుణంగా దెబ్బతింది. 10 అడుగుల మేర బ్రిడ్జి కొట్టుకుపోయింది. స్థానికులు అప్రమత్తమై హెచ్చరించడంతో దీనిపై రాకపోకలు నిలిపివేశారు.
ఆ టైమ్‌లో అటుగా బైక్‌పై వస్తున్న వ్యక్తిని హెచ్చరించడంతో అతను వెనుతిరిగి వెళ్లడంతో ప్రాణాలు నిలిచాయి. నైనిటాల్ జిల్లా కూడా వరదలకు తీవ్రంగా దెబ్బతింది. నైనిటాల్ సరస్సు గతంలో ఎన్నడూ లేనంతగా ఉప్పొంగింది. పెద్ద ఎత్తున ఆ వరదంతా రోడ్లను ఇళ్లను ముంచెత్తింది. సమీపంలోని గ్రామాలన్నీ కూడా పూర్తిగా జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. రామ్‌గఢ్ ప్రాంతంలో కొండ చరియలు విరిగిపడి ఇళ్లు నేలమట్టమయ్యాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com