ఉత్తరాఖండ్‌లో భీకర వరదలు.. 150 మంది ఉద్యోగుల గల్లంతు
భీకర వరదలు ఉత్తరాఖండ్‌ను అతలాకుతలం చేస్తున్నాయి.. మంచు కొండలు కరగడంతో ధౌలిగంగ నదిలో జల ప్రళయం సంభవించినట్లుగా తెలుస్తోంది. చమోలి జిల్లాలోని రైనీ వద్ద ఒక్కసారిగా పోటెత్తిన వరదలతో ఆ ప్రాంతాలన్నీ జలదిగ్బంధం అయ్యాయి. తపోవన్ ఏరియాలోని రేని గ్రామం సమీపంలోని ఓ పవర్ ప్రాజెక్టు దగ్గర ఆకస్మికంగా వరదలు వచ్చాయి. ధౌలి గంగా నదిలో ఒక్కసారిగా ప్రవాహనం పెరగడంతో డ్యామ్ కొట్టుకుపోయింది. పవర్ ప్లాంట్‌లోని 150 మంది ఉద్యోగుల గల్లంతయ్యారు. ఘటనా స్థలాన్ని ఉత్తరాఖండ్ సీఎం పరిశీలించారు. వరద ఉధృతి నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లో హైఎలర్ట్ ప్రకటించారు.
ఉగ్రరూపంలో వరద ముంచుకొస్తున్న తీరును చూసి అక్కడి వారికి ప్రళయం కళ్లముందు కనిపించింది. భీకర వరద కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి. డ్యామ్‌లు, బ్రిడ్జిలు సైతం వరద తాడికి తడిచిపెట్టుకుపోయాయి. ఇళ్లు కొట్టుకుపోయాయి.. ప్రకృతి సృష్టించిన విలయంతో రేనీ గ్రామం జలసమాధి అయ్యింది. వందల సంఖ్యలో జనం కొట్టుకుపోయి ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు.
మరోవైపు భీకర వరదల ప్రభావంతో ఉత్తరాఖండ్ ప్రభుత్వం అప్రమత్తమైంది.. చమోలి నుంచి హరిద్వార్ వరకు ముప్పు పొంచివుందన్న వార్తలతో అధికార యంత్రాంగం ప్రజలను అప్రమత్తం చేస్తోంది. సమాచారం అందుకున్న పరిపాలనా బృందం స్పాట్‌కు బయలుదేరింది.. పోలీసులు సైతం స్థానికులను అప్రమత్తం చేస్తున్నారు.. సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అటు ధౌలిగంగ నదిలో వరదలతో చమోలి జిల్లాలో హెచ్చరికలు జారీ చేశారు అధికారులు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com