international footballer Sangeeta Soren: జాతీయ ఫుట్‌బాల్ క్రీడాకారిణి వెతలు.. ఇటుక బట్టీలో పని చేస్తూ..

international footballer Sangeeta Soren: ఆటలు అందరికీ అచ్చిరావా.. కొందరికి వద్దంటే కోట్ల రూపాయల పారితోషికం వచ్చి పడుతుంది. మరి కొందరికి తినడానికి తిండి గింజలు కూడా లేని పరిస్థితి. అంతర్జాతీయ స్థాయిలో ఆడి దేశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చిన క్రీడాకారులు కూడా కుటుంబ పోషణకు కష్టపడే పరిస్థితి వస్తుంది. ఇది ప్రభుత్వం క్రీడాకారుల పట్ల చూపుతున్న నిర్లక్ష్య ధోరణికి నిదర్శనం.
కోవిడ్ మహమ్మారి ఎందరి జివితాలనో తలకిందులు చేసింది. తినడానికి తిండి దొరక్క కొందరు, చేయడానికి పని దొరక్క మరి కొందరు నానా కష్టాలు పడుతున్నారు. జాతీయ స్థాయిలో పతకాలు తెచ్చుకున్న క్రీడాకారులు కూడా పూట గడవడం కోసం ఏ పని చేయడానికైనా సిద్ధపడుతున్నారు. తాజాగా మహిళల ఫుట్‌బాల్ జట్టు క్రీడాకారిణి ధన్‌బాద్‌లోని ఇటుక బట్టీలో రోజువారీ వేతన కార్మికురాలిగా పని చేస్తోంది.
లాక్డౌన్ సమయంలో సహాయం కోరుతూ చేసిన వీడియోను చూసి జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. కానీ, ఎన్ని రోజులు ఎదురు చూసినా సహాయం అందలేదు. దాంతో తల్లితో పాటు తాను పనికి వెళ్లడం ప్రారంభించింది.
భూటాన్, థాయ్‌లాండ్‌లో జరిగే టోర్నమెంట్ల కోసం సంగీతను అండర్ -17 ఇండియా స్క్వాడ్స్‌లో ఎంపిక చేశారు. కానీ మహమ్మారి ఆమె ప్రణాళికలను దెబ్బతీసింది.
సంగీత తండ్రి దుబా సోరెన్ వృద్ధాప్యం కారణంగా పాక్షికంగా కంటి చూపును కోల్పోయారు. రోజువారి కూలి పనికి వెళ్లే అన్నయ్యకి కూడా లాక్డౌన్ల కారణంగా పని దొరకడం కష్టంగా మారింది. తద్వారా కుటుంబాన్ని పోషించే భారం సంగీతపై పడింది. సంగీత తన తల్లితో పాటు ఇటుక బట్టీలో పనిచేస్తోంది.
సంగీత తండ్రి మాట్లాడుతూ, ప్రభుత్వం తన కుమార్తెకు సహాయం చేస్తుందని ఆశించానని, అయితే అలాంటిదేమే జరగలేదని ఆయన చెప్పారు. స్థానిక ఎమ్మెల్యే కూడా సహాయం అందించడానికి ముందుకు రాలేదని ఆయన అన్నారు.
సంగీత తన కలని వదులు కోలేదు. కుటుంబాన్ని పోషించడానికి పనికి వెళుతున్నా మరో పక్క ప్రతి రోజు ఉదయం సమీపంలోని మైదానంలో ఫుట్ బాల్ ప్రాక్టీస్ చేయడానికి వెళుతుంటుంది.
రాష్ట్ర ప్రభుత్వం నుండి సరైన గుర్తింపు లభించకపోవడంతో ఆటగాళ్ళు జార్ఖండ్ నుంచి ఇతర రాష్ట్రాల కోసం ఆడుతున్నారని సంగీత అన్నారు.
"ప్రతి క్రీడాకారుడికి మంచి ఆహారం, అభ్యాసం అవసరం. అయితే ఇక్కడి ప్రభుత్వం ఆటగాళ్ల పట్ల చిన్న చూపు చూస్తోంది. అందుకే నా లాంటి ఆటగాళ్ళు కూలీ కార్మికులుగా పనిచేస్తున్నారు" అని ఆమె అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com