CBDT: ఏడాదికి రూ.20 లక్షలకు పైగా డిపాజిట్ చేస్తే.. ఇకపై..

CBDT: అక్రమ నగదు లావాదేవీలను అరికట్టే లక్ష్యంతో ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఏడాదికి 20 లక్షలకు మించి నగదు డిపాజిట్ చేస్తే పాన్, ఆధార్ నెంబర్ తప్పనిసరిగా నమోదు చేయాలి. 2022 మే 10 నాటి నోటిఫికేషన్‌లో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ రూపొందించిన కొత్త నియమ, నిబంధనలను సవరించింది. ఏడాది వ్యవధిలో 20 లక్షలకు మించి డిపాజిట్ చేస్తే పాన్, ఆధార్ వివరాలు సమర్పించాలని నిర్దేశించడం ఇదే మొదటిసారి.
ఆర్ధిక స్కాంలు, లెక్కల్లో చూపని నగదు లావాదేవీలను అరికట్టడానికి, ప్రభుత్వం వార్షిక నగదు పరిమితి నిబంధనలను సవరించింది. ఇప్పటి వరకు రోజుకు రూ.50 వేలకు మించి బ్యాంకులో డిపాజిట్ చేస్తే పాన్ కార్డ్ వివరాలను జత చేయాల్సి ఉండేది. ఇకపై ఏడాదికి 20 లక్షలకు మించి డిపాజిట్ చేస్తే పాన్ నెంబర్, ఆధార్ వివరాలు తప్పనిసరిగా అందించాలి. ఒకవేళ పాన్ కార్డ్ లేకపోతే దానికోసం అప్లై చేసి ఆ వివరాలను బ్యాంకులో సమర్పించాల్సి ఉంటుంది.
సన్నిహిత కుటుంబ సభ్యుల నుంచి తప్ప రూ.2 లక్షల కంటే ఎక్కువ విలువైన నగదు స్వీకరించడం కూడా నిషేధం. నిబంధనలకు విరుద్ధంగా ఆర్థిక లావాదేవీలు జరిగినట్లైతే 100 శాతం జరిమానా విధించ అవకాశం ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా ఆర్థిక మోసం, అక్రమ నగదు లావాదేవీల ప్రమాదాన్ని తగ్గించేలా ఆదాయపు పన్ను శాఖ నిబంధనలను సవరిస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com