Forbes: రష్యానుంచి అదానీ సీక్రెట్ లోన్.. ఫోర్బ్స్ సంచలన కథనం

హిండెన్‌బర్గ్ రీసెర్చ్ వివాదంతో ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన అదానీ గ్రూప్‌పై మరో సంచలన ఆరోపణలు చేసింది ఫోర్బ్స్ పత్రిక. రష్యా ప్రభుత్వ బ్యాంకు - VTB- నుంచి రుణాలు తీసుకున్న వ్యవహారాన్ని రహస్యంగా ఉంచినట్లు సంచలన కథనం ప్రచురించింది. అదానీ సోదరుడైన వినోద్ అదానీ నియంత్రణలో ఉన్న సింగపూర్ కంపెనీ ఇందులో కీలక పాత్ర పోషించిందని స్పష్టం చేసింది. సింగపూర్‌కు చెందిన పినకల్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్స్ PTE కంపెనీ- రష్యా ప్రభుత్వ బ్యాంకు VTB నుంచి వెయ్యి కోట్ల రూపాయల రుణం తీసుకున్నట్లు పేర్కొంది. దీనికి సంబంధించిన పత్రాలు తమ వద్ద ఉన్నాయని తెలిపారు.
ఈ రుణం తీసుకోవడం కోసం అదానీ ఎంటర్‌ప్రైజస్, అదానీ ట్రాన్స్‌మిషన్, అదానీ పోర్ట్స్, అదానీ పవర్‌కు చెందిన షేర్లను తాకట్టు పెట్టినట్లు వెల్లడించింది. ఈ షేర్లు ఆఫ్రో ఏషియా ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్స్ లిమిటెడ్, వరల్డ్ వైడ్ ఎమర్జింగ్ మార్కెట్ హోల్డింగ్ కంపెనీల పేర్లతో ఉన్నాయి. ఇవి ప్రమోటర్ కంపెనీలు. భారత కంపెనీల నిబంధనల మేరకు ప్రమోటర్లు తమ షేర్లను తాకట్టు పెడితే స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలపాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు ఈ రుణానికి సంబంధించిన విషయాన్ని అదానీ గ్రూప్ రహస్యంగా ఉంచిందని ఫోర్బ్స్ ఆరోపించింది. అదానీ గ్రూప్‌లో పెట్టుబడి పెట్టిన విదేశీ ఇన్వెస్టర్లపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. తాజాగా ఫోర్బ్స్ ప్రచురించిన కథనంతో అదానీ గ్రూప్ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇప్పటికే అదానీ కంపెనీలపై సెబి దర్యాప్తు చేస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com