సంచలనంగా మారిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ఆత్మకథ..

సంచలనంగా మారిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ఆత్మకథ..
ప్రధాని పదవిని నరేంద్ర మోదీ సాధించుకోగా, మన్మోహన్ సింగ్‌కు కట్టబెట్టారని తన ఆత్మకథ ది ప్రెసిడెన్షియల్‌ ఇయర్స్‌ పుస్తకంలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ప్రధాని పదవిని నరేంద్ర మోదీ సాధించుకోగా, మన్మోహన్ సింగ్‌కు కట్టబెట్టారని తన ఆత్మకథ ది ప్రెసిడెన్షియల్‌ ఇయర్స్‌ పుస్తకంలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను రాష్ట్రపతిగా ఉన్నపుడు మన్మోహన్‌ సింగ్‌తోపాటు నరేంద్ర మోదీ పాలన చూసే అవకాశం లభించిందన్నారు. ది ప్రెసిడెన్షియల్‌ ఇయర్స్‌ 11వ అధ్యాయంలో నా ప్రధానమంత్రులు.. భిన్న శైలులు.. భిన్న దృక్పథాలు శీర్షికన ప్రణబ్‌ తాను పనిచేసిన ప్రధానుల గురించి వివరించారు. రూప పబ్లికేషన్స్‌ ప్రచురించిన ప్రణబ్‌ ఆత్మకథ నిన్న మార్కెట్లోకి విడుదలైంది.

ప్రధాని మోదీ పార్లమెంటు సమావేశాల్లో తరచూ మాట్లాడాలని విపక్షాలు చెప్పేదాన్ని తప్పకుండా వినాలని ప్రణబ్‌ ఆత్మకథలో పేర్కొన్నారు. ప్రతిపక్షాలను ఒప్పించి తన వాణిని దేశానికి వినిపించేందుకు పార్లమెంటును వేదికగా చేసుకోవాలన్నారు. పార్లమెంటుకు ప్రధాని హాజరయ్యారంటే, వ్యవస్థ పనితీరుపై అది చాలా ప్రభావం చూపుతుందన్నారు. గత ప్రధానులను మోదీ స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. మోదీ తొలి విడత ప్రధానిగా ఉన్న సమయంలో పార్లమెంటు నిర్వహణలో తలెత్తిన సంక్షోభాలను పేర్కొంటూ ప్రణబ్‌ ఈ విధంగా రాసుకొచ్చారు.

యూపీఏ హయాంలో పార్లమెంటుకు హాజరవుతూ ప్రతిపక్ష నేతలతో టచ్‌లో ఉంటూ చర్చల ద్వారా క్లిష్టమైన అంశాలను తాను చక్కబెట్టినట్లు మాజీ రాష్ట్రపతి గుర్తుచేశారు. 2016 నవంబరు 8న పెద్ద నోట్ల రద్దు విషయాన్ని రాష్ట్రపతిగా ఉన్న తనతో మోదీ చర్చించలేదని ప్రణబ్‌ తెలిపారు. ఇలాంటి ప్రకటనలు హఠాత్తుగా చేయాల్సినవేనని సమర్థించారు. అటు సొంత పార్టీ కాంగ్రెస్‌కు చురకలంటించారు ప్రణబ్ ముఖర్జీ. ప్రజాకర్షక నాయకత్వాన్ని కోల్పోయిన విషయాన్ని కాంగ్రెస్‌ పార్టీ గుర్తించలేదని పేర్కొన్నారు. ఇలాంటి కారణాలతో 2014 ఎన్నికల్లో ఓడిపోయిందన్నారు. అసాధారణ నాయకత్వం లేకపోవడంతో యూపీఏ ప్రభుత్వం ఒక సాధారణమైనదిగా మిగిలిపోయిందన్నారు.

హిమాలయ రాజ్యం నేపాల్‌ భారత్‌లో విలీనమయ్యేందుకు ముందుకొచ్చినా దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ సున్నితంగా తిరస్కరించారని ది ప్రెసిడెన్షియల్‌ ఇయర్స్‌లో ప్రణబ్‌ ప్రస్తావించారు. పొరుగు దేశ రాజు త్రిభువన్‌ వీర్‌ విక్రమ్‌ చేసిన ప్రతిపాదనను నెహ్రూ తోసిపుచ్చారని పేర్కొన్నారు. నేపాల్‌ స్వతంత్ర రాజ్యమని.. అది అలాగే ఉండాలని ఆయన ఆకాంక్షించారన్నారు. ఆ సమయంలో నెహ్రూ స్థానంలో ఆయన కుమార్తె ఇందిరా గాంధీ ఉండి ఉంటే కథ వేరేలా ఉండేదని, సిక్కిం తరహాలో భారత్‌లో నేపాల్‌ అంతర్భాగం అయ్యేదని చెప్పుకొచ్చారు.

Tags

Read MoreRead Less
Next Story