పగలు కాలేజీకి.. నైట్ వాచ్‌మెన్ డ్యూటీకి.. IIM అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఎదిగిన రంజిత్..

మన జీవితం మరికొందరికి ప్రేరణ కావాలి. నడిచే బాటలో ముళ్లున్నా మొక్కవోని ధైర్యంతో ముందుకు వెళ్లాలి. అందరి జీవితాలు వడ్డించిన విస్తరి కావు. కష్టాలకు కృంగిపోకూడదు. ధైర్యంగా నిలబడాలి. అవకాశాలు నిన్ను వెతుక్కుంటూ రావు. నీవే వాటిని వెతుక్కోవాలి.
వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అంటూ నాన్న చిన్నప్పుడు చెప్పిన మాటలు రంజిత్ చెవిలో మారుమోగుతుండేవి. నాన్న పెద్ద చదువులు చదువుకోకపోయినా జీవిత పాఠాలు ఎన్నో నేర్చుకున్నాడు.
నాన్నే తన రోల్ మోడల్ అనుకున్నాడు. రాత్రిపూట నైట్ వాచ్‌మెన్‌గా డ్యూటీ చేస్తే పగలు కాలేజీకి వెళ్లి చదువుకునేవాడు. తన కష్టం ఊరికే పోలేదు. దేశంలోనే ప్రతిష్టాత్మకమైన రాంచీ ఐఐఎమ్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా సెలెక్ట్ అయ్యాడు.
ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన కేరళ కాసగోడ్‌కు చెందిన 28 ఏళ్ల రంజిత్ రామచంద్రన్ ప్రతికూల పరిస్థితుల్లో కూడా జీవితంలో అనుకున్నది సాధించవచ్చని నిరూపించాడు. "ఒక ఐఐఎం ప్రొఫెసర్ ఇక్కడ జన్మించాడు" అని ఫేస్‌బుక్‌లో తాను ఫ్రొఫెసర్‌గా ఎదిగిన తీరును పోస్ట్ చేశాడు. ఓ పక్క తన ఫోటో మరో పక్క తాను ఉంటున్న ఇల్లు, వర్షపు నీరు లోపలికి రాకుండా టార్పాలిన్ షీట్‌తో కప్పబడి ఉంది.
స్ఫూర్తిదాయకమైన తన స్టోరీని ఏప్రిల్ 9న సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో అతడి పోస్ట్ వైరల్ అయ్యింది. 37,000 మంది లైక్ కొట్టారు. సోషల్ మీడియాలో 'రంజిత్ ఆర్ పనాథూర్' పేరుతో ఉన్న ఈ పోస్ట్‌ను చదివి రామచంద్రన్‌ను అభినందించారు ఆర్థిక మంత్రి టిఎం థామస్ ఐజాక్.
రామచంద్రన్ కాసరగోడ్ లోని పనాథూర్ వద్ద ఒక బిఎస్ఎన్ఎల్ టెలిఫోన్ ఎక్స్ఛేంజ్‌లో నైట్ వాచ్ మాన్ గా పనిచేస్తున్నాడు. అతడు జిల్లాలోని ప్యూయస్ Xth కాలేజీ నుండి ఎకనామిక్స్ లో డిగ్రీ చేశాడు. "నేను పగటిపూట కాలేజీకి హాజరయ్యాను మరియు రాత్రి టెలిఫోన్ ఎక్స్ఛేంజ్లో పనిచేశాను" అని అతను పోస్ట్ చేశాడు.
గ్రాడ్యుయేషన్ పూర్తయిన తరువాత మద్రాసులోని ఐఐటిలో చేరాడు. అక్కడ మలయాళం మాత్రమే తెలిసిన అతడికి చదవడం కష్టమైంది. నిరాశ చెందిన అతడు పీహెచ్‌డీ ప్రోగ్రాం నుండి వైదొలగాలని నిర్ణయించుకున్నాడు. కానీ అతడి గైడ్ డాక్టర్ సుభాష్ ఇది నిన్ను నిరూపించుకునే అవకాశం.
వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకో. ఇంగ్లీష్ నేర్చుకో అని చెప్పారు. పట్టుదలతో ప్రయత్నిస్తే సాధ్యం కానిది లేదని చెప్పారు. ఆయన ఇచ్చిన ప్రోత్సాహంతో ఇంగ్లీష్ పట్ల భయాన్ని ఈజీగా పారద్రోలాడు.
"నేను పోరాడాలని నా కలను సాకారం చేయాలని నిర్ణయించుకున్నాను" అని రాంచద్రన్ ఫేస్‌బుక్‌లో రాశాడు. రాంచద్రన్ గత సంవత్సరం డాక్టరేట్ సంపాదించాడు. గత రెండు నెలలుగా బెంగళూరులోని క్రైస్ట్ విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.
"ఈ పోస్ట్ వైరల్ అవుతుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఇది మరికొందరికి స్ఫూర్తినిస్తుందని ఆశతో నా జీవిత కథను పోస్ట్ చేసాను. ప్రతి ఒక్కరూ మంచి కలలు కనాలని మరియు వారి కలల కోసం పోరాడాలని నేను కోరుకుంటున్నాను. కొందరైనా దీని నుండి ప్రేరణ పొందాలని విజయం సాధించాలని నేను కోరుకుంటున్నాను అని రాంచద్రన్ పేర్కొన్నారు.
ఆర్థిక ఇబ్బందుల కారణంగా తాను పాఠశాల విద్యను దాదాపుగా వదులుకున్నానని రామచంద్రన్ తన పోస్టులో గుర్తు చేసుకున్నారు . అతని తండ్రి బట్టలు కుట్టే టైలర్ వృత్తి. తల్లి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రోజువారీ కూలీ పనులు చేస్తుంటుంది.
ఆర్థిక మంత్రి రామచంద్రన్‌ను ప్రశంసించారు. "వివిధ సంక్షోభాలు నిరుత్సాహపరిచినా రంజిత్ వంటి వ్యక్తుల జీవితాలు సామాజిక, ఆర్థిక వెనుకబాటుతనాన్ని అధిగమించడానికి విద్యను ఆయుధంగా ఉపయోగించుకోవడం అందరికీ ప్రేరణ" అని ఆయన అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com