సైనిక లాంఛనాలతో వీర జవాన్ జశ్వంత్ అంత్యక్రియలు..!

కశ్మీర్‌లోని ఉగ్రవాదులు, సైన్యానికి మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ప్రాణాలుకోల్పోయిన జవాన్ జశ్వంత్‌రెడ్డి అంత్యక్రియలు ముగిశాయి. ఆయన స్వగ్రామం గుంటూరు జిల్లా బాపట్ల మండలం దరివాదకొత్తపాలెంలో సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి చేశారు. అంత్యక్రియల్లో భారీ ఎత్తున జనం పాల్గొన్నారు. జై జవాన్ అంటూ నినాదాలు చేశారు. జమ్మూకశ్మీర్‌లోని రాజౌరి జిల్లా సుందర్‌బాని సెక్టార్‌లో గురువారం సాయంత్రం జరిగిన ఉగ్రపోరులో జవాన్ జశ్వంత్‌రెడ్డి అమరుడయ్యాడు. ఉగ్రవాదుల కాల్పుల్లో మొత్తం ఇద్దరు సైనికులు మృతి చెందగా వారిలో జశ్వంత్‌రెడ్డి ఒకరు. జశ్వంత్‌రెడ్డి పార్థివదేహాన్ని శుక్రవారం ప్రత్యేక విమానంలో హకీంపేట్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌కు తీసుకువచ్చారు. సీనియర్ మిలిటరీ, ఎయిర్‌ఫోర్స్, సివిల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు నివాళులర్పించిన అనంతరం స్వగ్రామానికి తరలించారు. ఆయనకు తండ్రి శ్రీనివాసరెడ్డి, తల్లి వెంకటేశ్వరమ్మతో పాటు యశ్వంత్‌రెడ్డి, విశ్వంత్‌రెడ్డి అనే ఇద్దరు తమ్ముళ్లు ఉన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com