Patil Kaki : అమ్మనేర్పించిన వంట ఆమెను కోటీశ్వరురాలిని చేసింది.. పాటిల్ కాకి సక్సెస్ స్టోరి

Patil Kaki : అమ్మనేర్పించిన వంట ఆమెను కోటీశ్వరురాలిని చేసింది.. పాటిల్ కాకి సక్సెస్ స్టోరి
Patil Kaki : జోరున వర్షం కురుస్తున్నా, ఎండ మండి పోతున్నా పొట్టలో ఏదో ఒకటి పడాల్సిందే.. లేకపోతే ఆకలి రాముడు కేకలు పెడతాడు..

Patil Kaki: జోరున వర్షం కురుస్తున్నా, ఎండ మండి పోతున్నా పొట్టలో ఏదో ఒకటి పడాల్సిందే.. లేకపోతే ఆకలి రాముడు కేకలు పెడతాడు.. అదే ఫుడ్ బిజినెస్‌లకు వరంగా మారుతోంది. టెక్నాలజీ పెరిగిందే.. అరచేతిలో ఫోను ఎన్నో నేర్పిస్తోంది. అమ్మ నేర్పించిన వంటలతో పాటు ఆన్‌లైన్లో బిజినెస్ ఎలా చేయాలో నేర్చుకుంది గీతా పాటిల్.. అదే ఇప్పుడు ఆమెకు కోట్లు సంపాదించి పెడుతోంది.

ఇంటి పట్టునే ఉండి వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరింపజేస్తోంది. మహారాష్ట్రలో గీతా పాటిల్ పేరు మార్మోగిపోతోంది.. ఆమె వంటలు రుచి చూసి టేస్ట్ అదుర్స్ అంటున్నారు.. ఫుడ్ లవర్స్ ఎగబడి కొంటున్నారు. ముంబయి వాసుల హృదయాల్లో చోటు సంపాదించుకున్న గీతా పాటిల్ సక్సెస్ స్టోరీ గురించి మనమూ తెలుసుకుందాం..

గీతా పాటిల్ తల్లి కమలాబాయి ఇడ్లీ, వడ, దోసె, పూరి వంటి టిఫిన్లు తయారు చేసి సర్వ్ చేసేది.. ఆ సమయంలో అమ్మకు చేదోడు వాదోడుగా ఉండేది గీత. ఈ రోజు తాను పెద్ద వ్యాపార వేత్త కావడానికి అప్పుడే పునాది పడింది అని సంతోషంగా చెబుతుంది గీత.

48 ఏళ్ల గీతా పాటిల్ ముంబైలోని సామాన్య మహారాష్ట్ర కుటుంబానికి చెందినవారు. ఆమె తండ్రి బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (BMC)లో పనిచేశారు. తల్లికి సహాయకురాలిగా పని చేసిన గీత ఏదో ఒక రోజు తానూ సొంతంగా వ్యాపారం చేస్తానని ఊహించలేదు. కుటుంబ ఆర్థిక పరిస్థితులే ఆమె వ్యాపారానికి పురిగొల్పాయి.

2016లో గీత భర్త గోవింద్ ఉద్యోగం కోల్పోయాడు. ఇద్దరు చిన్నపిల్లలను పెంచి పోషించడం కష్టమైపోయింది. కుటుంబం ఆర్థికంగా చితికిపోయింది. ఏదో ఒకటి చేసి కుటుంబాన్ని ఆర్థిక బాధలనుంచి గట్టెక్కించాలనుకుంది. తీవ్రంగా ఆలోచించి తన తల్లి ద్వారా నేర్చుకున్న విద్య గుర్తొచ్చింది. ఇరుగుపొరుగు వారికి రుచికరమైన స్నాక్స్ తయారు చేసి రుచి చూడమంటూ ఇచ్చేది. బావున్నాయి బాగా చేస్తున్నావని మెచ్చుకునేవారు.. మరి కొన్ని తయారు చేసి ఇవ్వమనేవారు.. అలా తన బిజినెస్ ఇంటి నుంచే ప్రారంభించింది గీత. ప్రభాత్ కాలనీలోని బీఎంసీ ఉద్యోగులకు టిఫిన్ సరఫరా చేయడం ప్రారంభించింది. 2016 నుండి 2020 వరకు నెలకు దాదాపు లక్ష రూపాయల వరకు సంపాదించింది ఒక్క టిఫిన్స్ ద్వారానే.

పాటిల్ కాకి: ప్రియమైన మహారాష్ట్ర ఫుడ్ బ్రాండ్

టిఫిన్ వెంచర్‌ను విజయవంతంగా నడిపిన కొన్ని సంవత్సరాల తర్వాత, గీత కుమారుడు వినీత్ అమ్మకు వ్యాపారంలో తోడుగా నిలిచాడు. గ్రేడింగ్, మార్కెటింగ్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుని వ్యాపారాన్ని పెంచే పనిలో పడ్డాడు. అమ్మ చేస్తున్న ఆహార వ్యాపారానికి 'పాటిల్ కాకి' అని పేరు పెట్టాడు. నేడు, పాటిల్ కాకీ సంవత్సరానికి రూ.1.4 కోట్ల ఆదాయాన్ని సంపాదిస్తున్నారు.

ఫుడ్ వెంచర్ మహిళలకు మంచి బిజినెస్.. ఉపాధి కల్పిస్తుంది.. సొంతంగా తమ కాళ్ల మీద తాము నిలబడే ధైర్యాన్నిస్తుంది. బేసన్ లడ్డూ, చివ్డా, మోదక్స్, పురాన్‌పోలిస్ వారి బెస్ట్ సెల్లర్‌లలో ముఖ్యమైన ఐటెంస్. ముంబై, పూణేలో ప్రతి నెలా దాదాపు 10,000 పురాన్‌పోలీలు మరియు 500 కిలోల జంతికలను తయారు చేసి రవాణా చేస్తోంది గీతా పాటిల్. తన వ్యాపారంలో భర్తనూ భాగస్వామ్యం చేసింది.

Tags

Read MoreRead Less
Next Story