అమెరికా యూనివర్సిటీలో సీటొచ్చినా.. అరక పట్టి పొలం దున్ని..

మెరుగైన భవిష్యత్తు కోసం యువత స్వదేశాన్ని విడిచిపెట్టి విదేశాలకు వెళ్లాలని ఉత్సాహంగా ఉన్న సమయంలో, పంజాబ్ కనోయి గ్రామానికి చెందిన అమన్‌దీప్ కౌర్ (21) తన విదేశీ కలలను కొనసాగించకూడదని నిర్ణయించుకుంది. దానికంటే నాన్న చేస్తున్న వ్యవసాయమే తనను ఆకర్షించింది. తన తండ్రికి వ్యవసాయంలో చేదోడు వాదోడుగా ఉంటూ ఇప్పుడు చుట్టు పక్కల గ్రామ ప్రజలకు ఆదర్శ రైతుగా మారింది అమన్‌దీప్ కౌర్.
అమన్ కూడా అందరిలాగే విదేశాలకు వెళ్లాలని, అక్కడే చదువుకుని మంచి ఉద్యోగం చేయాలని కోరుకుంది. 2018 లో IELTS ని క్లియర్ చేసింది. కెనడియన్ కళాశాల నుండి ఆఫర్ లెటర్ కూడా వచ్చింది. కానీ ఒకసారి వ్యవసాయం చేస్తున్న నాన్నకు సహాయం చేయడానికి పొలంలోకి వెళ్ళినప్పుడు, నేను విదేశాలకు వెళితే నాన్న ఒంటరిగా ఉంటాడని, ఒక్కడే వ్యవసాయం పనులు చూసుకోవాల్సి వస్తుందని ఆలోచించింది.
ఆ క్షణమే నిర్ణయించుకుంది.. విదేశాలకు వెళ్లకూడదని.. ఇక్కడే ఉండి తండ్రికి సహాయం చేయాలని అనుకుంది. గత మూడేళ్లుగా తన తండ్రికి వ్యవసాయ పనుల్లో సహాయం చేస్తోంది. ఉదయం పొలానికి వెళ్లి రోజంతా కష్టపడి పనిచేస్తుంది. వ్యవసాయంతో పాటు అమన్ ఫుడ్ ప్రాసెసింగ్‌లో డిప్లొమా కూడా చేస్తోంది.
"నా గ్రామంలోని ప్రజలు నన్ను ఈ రంగంలో పనిచేయడానికి ఎప్పుడూ ప్రేరేపించారు. బాలికలు అన్ని ప్రాంతాలలో అబ్బాయిలతో పోటీ పడగలిగినప్పుడు, వ్యవసాయంలో మాత్రం ఎందుకు రాణించరని ప్రశ్నిస్తుంది. బాలికలు వ్యవసాయంలో తమ కుటుంబాలకు సహాయం చేయడం ప్రారంభించాలని నేను కోరుతున్నాను"అని ఆమె అన్నారు.
"వ్యవసాయానికి సంబంధించిన అన్ని పనులను నా కూతురు ఒంటరిగా నిర్వహించలగలదు. అందుకు నేనెంతో గర్వపడుతున్నాను"అని ఆమె తండ్రి హర్మిలాప్ సింగ్ అన్నారు. "అమన్‌దీప్ పొలంలో పనిచేయడాన్ని చూసిన తరువాత, మా ప్రాంతంలోని అనేక ఇతర కుటుంబాలు తమ అమ్మాయిలను పొలాలలో పని చేయడానికి అనుమతించాలని ఆలోచిస్తున్నాయి" అని ఆమె మామ జగదీప్ సింగ్ చెప్పారు.
ఉన్నత పాఠశాల విద్య పూర్తి చేసిన అమన్, వ్యవసాయంలో పాటియాలా ఖల్సా కాలేజ్ నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ చేసింది. ట్రాక్టర్‌ను ఎలా నడిపించాలో నేర్చుకుంది. రెండు సంవత్సరాల క్రితం హ్యాపీ సీడర్‌ను ఉపయోగించడం ప్రారంభించింది. పొలంలో చెరకు, గోధుమలను పండించి మిగిలిన వ్యర్ధాలను తండ్రి ఇతర రైతుల మాదిరిగానే తగలబెట్టేవాడు.
ఆ పొగకి అమన్ ఊపిరి ఆడక ఇబ్బంది పడేది. తాను వ్యవసాయం చేయడం ప్రారంభించిన తరువాత పంట వ్యర్థాలను అక్కడే నీటిలో నాననిచ్చి ఎరువుగా మార్చేసేది. మొదటి ఏడాది ఎరువులు లేకుండానే 50 శాతం దిగుబడిని సాధించింది. ఈ మార్పులతో జిల్లా కలెక్టర్ అభినందనలతో పాటు, చుట్టు పక్కల గ్రామ ప్రజల ప్రశంసలూ అందుకుంది అమన్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com