Digambar Kamat: దేవుడే పార్టీ మారమన్నాడు: మాజీ సీఎం విచిత్ర వ్యాఖ్యలు

Digambar Kamat: గెలిచిన పార్టీ నుంచి బీజేపీలోకి ఎందుకు ఫిరాయిస్తున్నారని అడిగితే.. దేవుడే పార్టీ మారమన్నారంటూ విచిత్ర సమాధానం చెప్పారు గోవా కాంగ్రెస్ ఎమ్మెల్యే. నిజానికి పార్టీ మారబోమంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏడు నెలల క్రితం విధేయత ప్రతిజ్ఞ చేశారు.
అసెంబ్లీకి ఎన్నికయ్యాక ఎమ్మెల్యేలు జారిపోకుండా రాహుల్ గాంధీ గోవా ఎమ్మెల్యేలతో ఆలయం, చర్చి, మసీదుల్లో ప్రమాణాలు కూడా చేయించారు. కానీ ఏడు నెలలు గడవకముందే తమ ప్రతిజ్ఞను పక్కనబెడుతూ గోవా కాంగ్రెస్‌లోని 11మంది ఎమ్మెల్యేల్లో 8 మంది పార్టీ మారిపోయారు.
గోవా సీఎం ప్రమోద్ సావంత్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. వీరిలో మాజీ సీఎం దిగంబర్ కామత్ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా పార్టీ మారడంపై కామత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారేందుకు దేవుడి అంగీకారం తీసుకున్నానని కామెంట్ చేశారు. తనతో సహా బీజేపీలో చేరినవారంతా పార్టీ మార్పుపై భగవంతుడిని అడిగారని, అందుకు దేవుడు అంగీకరించారని చెప్పుకొచ్చారు.
ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీని వీడబోమని ప్రతిజ్ఞ చేసిన మాట వాస్తవమేనని, కానీ మళ్లీ గుడికి వెళ్లి ఏం చేయమంటారని ఆ భగవంతుడిని అడిగామని, ఏది మంచిదో అది చేయమని దేవుడు తమకు చెప్పాడని సమాధానం ఇచ్చారు. దీనిపై సెటైర్లు పేలుతున్నాయి. పార్టీ ఫిరాయింపునకు దేవుడు అంగీకరించడం ఏంటని నవ్వుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com