Gujarat : "నా కుమారుడు అమాయకుడు.. అయినా నేను రాజీనామా చేస్తున్నా"

పీఎంఓ అధికారినని చెప్పుకుంటూ కాశ్మీర్ లో పర్యటించిన నిందితుడి బృందంలో గుజరాత్ సీఎంఓలో పనిచేస్తున్న సీనియర్ అధికారి కుమారుడు ఉన్నాడు. గుజరాత్ సీఎంఓలో పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ (PRO)గా హితేష్ పాండ్యా 2001నుంచి పని చేస్తున్నారు. అయన కుమారుడు కాశ్మీర్ లో పీఎంఓ అధికారినని చెప్పుకున్న కిరణ్ భాయ్ పటేల్ బృందంలో ఉన్నాడు. కొడుకు చేసిన పనికి నైతిక బాధ్యత వహిస్తూ హితేష్ పాండ్యా తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. శుక్రవారం సాయంత్రం సీఎం భూపేంద్ర పటేల్ కు రాజీనామాను సమర్పించారు. మరోవైపు గుజరాత్ బీజేపీ కూడా అమిత్ పాండ్యాను పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి సస్పెండ్ చేసింది.
"నా కొడుకు అమాయకుడు. అయితే, సీఎంఓ, పీఎంఓ ప్రతిష్టను దిగజార్చడం నాకు ఇష్టం లేదు, అందుకే నేను పదవికి రాజీనామా చేస్తున్నాను" అని పాండ్యా తన రాజీనామా లేఖలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. అమిత్ పాండ్యా గుజరాత్ లోని నార్త్ జోన్ కు పార్టీ సోషల్ మీడియా విభాగానికి ఇంచార్జ్ గా ఉన్నారు.
పీఎంఓ సీనియర్ అధికారిగా నటిస్తూ నాలుగు నెలలకుపైగా అధికారిక ప్రోటోకాల్ ను ఆస్వాదించాడు కిరణ్. విషయాన్ని తెలుసుకున్న పోలీసులు ఈ నెల ప్రారంభంలో అతన్ని అరెస్ట్ చేశారు. కిరణ్ టీంలో ఉన్న అమిత్ పాండ్యాను, జే సీతాపరను పోలీసులు విడిచిపెట్టారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

