Gujarath: గుజరాత్‌లో రెండో దశ పోలింగ్.. బారులు తీరిన ఓటర్లు

Gujarath: గుజరాత్ లో రెండో దశ పోలింగ్ కొనసాగుతుంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు పోలింగ్ స్టేషన్ల వద్ద బారులుతీరారు. 14 జిల్లాల పరిధిలోని 93 అసెంబ్లీ సీట్లలో చివరి విడత పోలింగ్ జరుగుతోంది.
మొత్తం 833 మంది బరిలో ఉండగా.. 2.51 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. రెండో దశలో గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ సైతం అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది.
ప్రధాని మోదీ అహ్మదాబాద్‌లోని రాణిప్‌లోని నిషాన్ స్కూల్‌లో తన ఓటేశారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకామేశ్వర్ ఆలయం సమీపంలోని మున్సిపల్ సబ్ జోనల్ కార్యాలయంలో ఓటు వేశారు..అలాగే యూపీ గవర్నర్ ఆనందిబెన్ పటేల్ అహ్మదాబాద్‌లోని శిలాజ్ అనుపమ్ స్కూల్‌లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రధాని మోదీ తల్లి హీరా బెన్ కూడా వీల్‌చైర్‌లో వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ప్రధాన పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారిన గుజరాత్ అసెంబ్లీ రెండో దశలో నార్త్,సెంట్రల్ గుజరాత్‌లోని 14 జిల్లాల్లో ఉన్న స్థానాలకు ఎన్నికలు జరుగనుండగా..వీటిలో వడోదరా, అహ్మదాబాద్, గాంధీనగర్ లాంటి నగరాలు కూడా ఉన్నాయి. 93 స్థానాల్లో మొత్తం 2కోట్ల 54 లక్షల మంది ఓటర్లున్నారు.
26,409 బూత్‌లలో దాదాపు 36వేలEVM లతో పోలింగ్ జరుగుతుంది. 2వేలమంది ప్రిసైడింగ్ అధికారులు, 84,వేల మంది పోలింగ్ సిబ్బంది విధుల్లో ఉన్నారు. గుజరాత్ ఎన్నికల్లో త్రిముఖ పోటీ నెలకొంది. బీజేపీ, కాంగ్రెస్, ఆప్ పార్టీలు తమ హేమాహేమీ నాయకులను ప్రచార బరిలోకి దింపాయి. మొత్తం 833 మంది అభ్యర్థులు భవిత్యం డిసెంబర్ 8న తేలనుంది.
ఇక సెకండ్ ఫేజ్‌లో పలువురు ప్రముఖులు బరిలో ఉన్నారు. ఘట్లోడియా నుంచి సీఎం భూపేంద్ర పటేల్, విరామ్‌గామ్ నుంచి పాటిదార్ నాయకుడు హార్దిక్ పటేల్, గాంధీనగర్ సౌత్ నుంచి ఓబీసీ నాయకుడు అల్పేష్ ఠాకోర్ పోటీలో ఉన్నారు. బీజేపీ తరఫున ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా, రాజ్‌నాథ్ సింగ్.. కాంగ్రెస్ తరఫున ఆ పార్టీ చీఫ్ మల్లిఖార్జున్ ఖర్గే.. ఆప్ తరఫున ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ప్రచారం నిర్వహించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com