Gujarat MLA: ఆయనకి ఇద్దరు... అంతా కలిసి మెలసి ఎన్నికల్లో గెలిచి...

Gujarat MLA: ఆయనకి ఇద్దరు... అంతా కలిసి మెలసి ఎన్నికల్లో గెలిచి...
ఇద్దరు భార్యలే విజయ రహస్యమంటోన్న గుజరాత్ ఎమ్మెల్యే

ప్రతి పురుషుడి విజయం వెనుక ఓ మహిళ ఉంటుందని అంటారు. కానీ, గుజరాత్ కు చెందిన ఎమ్మెల్యే వెనుక ఇద్దరు మహిళలు ఉన్నారు. అంటే ఏముందిలే తల్లి, భార్య, చెల్లి ఎంతమందైనా ఉండొచ్చు కదా అంటారా! నిజమే కానీ, ఇక్కడ మనోడి వెనక ఉన్నది ఇద్దరు భార్యలు. అందుకే ఈ ముచ్చట జాతీయ స్థాయిలో పెద్ద వార్త అయింది. గుజరాత్ లోని దేదియాపాడా అనే గిరిజన ప్రాంతానికి చెందిన చైతర్ వాసవా అనే వ్యక్తి ఆప్ పార్టీ తరఫున గెలిచిన ఏకైక ఎమ్మెల్యేగా స్థానికంగా రికార్డ్ సృష్టించాడు. భాజాపా, కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగిన బలమైన ప్రత్యర్ధులను ఓడించి పదవిని కైవసం చేసుకున్నారు. అయితే తన విజయం వెనుక తన ఇద్దరి భార్యల కృషి ఉందని ధైర్యంగా చెబుతున్నాడు చైతర్.


2014లో భాజాపాలో చేరి గిరిజన ప్రజల సంక్షేమం కోసం పని చేసిన చైతర్ దేదీయాపాడాలో భాజాపా అధ్యక్షుడి కుమారుడి గెలుపులో కీలక పాత్ర పోషించాడు. అప్పటికే ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న చైతర్ రాజకీయాల్లో కీలకంగా మారాక ఉద్యోగానికి రాజీనామా చేశాడు. అతడి ఇద్దరు భార్యలు శకుంతల, వర్ష సైతం ప్రభుత్వ ఉద్యోగాల్లోనే కొనసాగుతుండేవారు. అయితే చైతర్ రాజకీయ భవిష్యత్తు కోసం ఇరువురూ తమ ఉద్యోగాలకు రాజీనామా చేసి భర్త విజయానికి కృషి చేశారు. ఇక మరో విచిత్రం ఏమిటంటే వీళ్లు ముగ్గురూ ఒకే బడిలో కలసి చదువుకున్నారట. శకుంతల, వర్ష మంచి స్నేహితురాళ్లని అంటాడు చైతర్. 13ఏళ్ల క్రితం శకుంతలతో మొదటి వివాహం జరగ్గా, మరో రెండేళ్లకు వర్షను సైతం తన జీవితంలోకి ఆహ్వానించాడట. అప్పటి నుంచి అందరూ కలిసే ఉంటున్నారట. శకుంతలతో ఒకరికి, వర్షతో మరో ఇద్దరికీ జన్మనిచ్చి ముగ్గురు పిల్లలకు తండ్రయ్యాడు. విచిత్రం ఏమిటంటే గిరిజన మహిళల హక్కుల కోసం జరిపిన పోరాటాల్లో ఎన్నో సార్లు చైతర్ జైలు పాలయ్యాడట. ఇక అతడి భార్యలు సైతం భర్త ఆశయాలకు తమ వంతు సహాయం చేసేందుకు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటామని చెబుతున్నారు. ఆయన గెలుపే తమకు శ్రీరామ రక్ష అంటున్నారు ఈ ఆదర్శ భార్యామణులు....


Tags

Read MoreRead Less
Next Story