Gujarat: మాటలకందని మహా విషాదం.. గుజరాత్ ఘోరం

Gujarat: మాటలకందని మహా విషాదం గుజరాత్ రాష్ట్రాన్ని కుదిపేస్తోంది.. మోర్బి జిల్లాలోని మచ్చు నదిపై కేబుల్ బ్రిడ్జి కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య మరింతగా పెరుగుతోంది.. ఇప్పటివరకు అధికారిక లెక్కల ప్రకారం 140 మంది మరణించగా, పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు.. మృతిచెందిన వారిలో మహిళలు, చిన్నారులే ఎక్కువగా ఉండటం తీవ్ర విషాదాన్ని నింపుతోంది.
ప్రమాద సమయంలో కేబుల్ బ్రిడ్జిపై దాదాపు 500 మంది ఉన్నారు.. అంతా ఒకవైపుకు చేరుకోవడంతో బ్రిడ్జిపై ఒత్తిడి పడి తెగిపోయినట్లుగా తెలుస్తోంది.. బ్రిడ్జి కూలిపోవడంతో ఒక్క ఉదుటున సగం మందికిపైగా నీళ్లలో పడిపోయారు.. కొందరు ఈత కొట్టుకుంటూ ఒడ్డుకు చేరుకోగా.. చాలా మంది నీళ్లలోనే మునిగి ఊపిరాడక ఉక్కిరిబిక్కిరై ప్రాణాలు వదిలారు.
ప్రమాద సమాచారం అందిన వెంటనే ఎన్డీఆర్‌ఎఫ్‌తో పాటు ఇతర రెస్క్యూ సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకొని బోట్ల ద్వారా సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం అంబులెన్సుల్లో సమీప దవాఖానలకు తరలించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నదని డీజీపీ అశిష్ భాటియా తెలిపారు. సామర్థ్యానికి మించి పర్యాటకులు వంతెనపై నిలబడటంతోనే కూలినట్టు అధికారులు భావిస్తున్నారు.
ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్,కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున కర్గే తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.గుజరాత్ ప్రభుత్వం మృతుల కుటుంబాలకు 4 లక్షలు, క్షతగాత్రులకు 50 వేల ఆర్థిక సాయం ప్రకటించగా.. ప్రధానమంత్రి సహాయనిధి నుంచి మృతుల కుటుంబాలకు రెండు లక్షలు,క్షతగాత్రులకు రూ.50 వేలు ఆర్థిక సాయం చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. సీఎం భూపేంద్ర పటేల్ సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిపై సమీక్ష చేశారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు.
765 అడుగుల పొడవు ఉండే ఈ కేబుల్ బ్రిడ్జిని 1879లో నిర్మించారు. ఈమధ్య బ్రిడ్జికి రిపేర్ చేసి పర్యాటకుల కోసం అక్టోబర్ 26న తిరిగి ప్రారంభించారు. ఫిట్‌నెస్ సర్టిఫికెట్ లేకుండానే బ్రిడ్జిని తిరిగి ప్రారంభించారన్న విమర్శలు ఉన్నాయి.
అయితే ఈ ఘటనకు గుజరాత్ ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహిస్తున్నట్లు ఆ రాష్ట్ర మంత్రి బ్రిజేశ్ మీర్జా తెలిపారు. మృతుల కుటుంబాలను, క్షతగాత్రులను ప్రభుత్వం అన్ని విధాలా అదుకుంటుందని హామీ ఇచ్చారు. మరోవైపు ఈ ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారణకు ఆదేశించినట్లు రాష్ట్రప్రభుత్వం తెలిపింది. దాదాపు 140 ఏళ్ల చరిత్ర కలిగిన బ్రిడ్జికి ఇటీవలే రిపేర్ చేసి సందర్శకులను అనుమతించాం. అంతలోనే ఈ ఘోరం జరగడం బాధాకరం అన్నారు.
మరోవైపు ఎక్కువ మంది నడవటంతో పాటు జన సాంద్రత తట్టుకోలేకే కూలినట్లుగా భావిస్తున్నారు. ఓవైపు సహాయక చర్యలు కొనసాగుతుండగానే కొన్ని వీడియోలు బయటకు వచ్చాయి. వంతెన పటిష్టతను చెక్ చేయడానికే బ్రిడ్జీపై నుంచి నడుస్తూనే కొందరు తోసుకుంటున్న దృశ్యాలు ఉన్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com