Gujarath: బామ్మగారి పాల వ్యాపారం.. ఏడాదికి కోటి రూపాయల ఆదాయం..

Gujarath: ఖాళీగా కూర్చుంటే ఏం వస్తుంది. ఒంట్లో ఓపిక ఉన్నంత వరకు ఒకరి మీద ఆధారపడకుండా బతకాలి.. వచ్చిన పని చేసుకోవాలి. తద్వారా అంతో ఇంతో ఆదాయాన్ని సంపాదించుకోవచ్చు అని ఈ 65 ఏళ్ బామ్మ అందరికీ చెబుతోంది. దాంతో చుట్టు పక్కల గ్రామాల వాళ్లు ఆమెతో చేయి కలుపుతున్నారు. బామ్మ డెయిరీ ఫామ్‌లో తామూ పెట్టుబడి పెడతామని ముందుకు వస్తున్నారు.
ఉద్యోగం చేసేంత చదువు లేదు.. ఊరికే కూర్చోవడం అస్సలు ఇష్టం లేదు.. అక్షరం ముక్క రాకపోతేనేం.. వ్యాపారం చేసేంత తెలివితేటలు మాత్రం పుష్కలంగా ఉన్నాయి. తన నమ్మకము, తన కష్టమే తన డెయిరీ ఫామ్‌కి పెట్టుబడిగా పెట్టింది. ఈ రోజు ఏడాదికి కోటి రూపాయల ఆదాయం ఆర్జిస్తోంది. పాడి పశువులంటే మక్కువ ఉంటే దానిని మీరు ఆదాయ వనరుగా మార్చుకోవచ్చు అని చెప్పే ఈ బామ్మ సక్సెస్ స్టోరీ తెలుసుకుందాం.. గుజరాత్‌కు చెందిన 62 ఏళ్ల నవల్‌బెన్ దల్‌సంగ్‌భాయ్ చౌదరి.. ఇప్పుడు ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తోంది.
బనస్కాంత జిల్లాలోని నగానా గ్రామానికి చెందిన నవల్బెన్ తన జిల్లాలో అన్ని అసమానతలను ధిక్కరించింది. 2020లో రూ. 1.10 కోట్ల విలువైన పాలను విక్రయించి, నెలకు రూ. 3.50 లక్షల లాభాన్ని ఆర్జించి రికార్డు సృష్టించింది. 2019లో ఆమె రూ. 87.95 లక్షల విలువైన పాలను విక్రయించింది.
గతేడాది నవల్‌బెన్ తన ఇంటి వద్ద పాల కంపెనీని ప్రారంభించింది. ఇప్పుడు, ఆమె దగ్గర 80కి పైగా గేదెలు, 45 ఆవులు ఉన్నాయి. బామ్మ డెయిరీ ఫామ్‌లోని పాలు చుట్టు పక్కల అనేక గ్రామాల్లోని ప్రజల పాల అవసరాలను తీరుస్తున్నాయి.
తనకు నలుగురు కుమారులు ఉన్నారని, వారి సంపాదన తన సంపాదన కంటే చాలా తక్కువ అని ఒకింత గర్వంతో చెబుతోంది నవల్బెన్. ప్రతిరోజూ ఉదయం తన ఆవులకు పాలు పితికే నవల్బెన్ డెయిరీలో పదిహేను మంది పనిచేస్తున్నారు.
'10 మిలియనీర్ గ్రామీణ మహిళా పారిశ్రామికవేత్తల' జాబితాను అమూల్ డెయిరీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆర్‌ఎస్ సోధి గత ఏడాది వెల్లడించారు. పాడి పరిశ్రమ మరియు పశుపోషణలో నిమగ్నమైన నవల్బెన్ వంటి మహిళలు అమూల్‌కు పాలు విక్రయించడం ద్వారా లక్షల రూపాయలు అందుకున్నారు.
జాబితాలో, నవల్‌బెన్ ఆ సంవత్సరం 221595.6 లీటర్ల పాలను విక్రయించడం ద్వారా రూ. 87,95,900.67ను ఆర్జించింది. ఆమె మొత్తం 10 మంది మహిళల్లో అత్యధికంగా సంపాదించిన మహిళగా రికార్డుకెక్కింది. బనస్కాంత జిల్లాలోని పాడిపరిశ్రమ రంగంలో ఆమె సాధించిన విజయాలకు గాను రెండు లక్ష్మీ అవార్డులు, మూడు ఉత్తమ పశుపాలక అవార్డులను కూడా అందుకుంది.
60ఏళ్ల వయసు వచ్చిన వాళ్లు అన్నిటికీ ఒకరి మీద ఆధాపడాలనుకుంటారు.. కానీ నావల్‌బెన్ మాత్రం తనతో పాటు మరికొంత మంది మహిళలకు ఆసరా ఇస్తూ అత్యంత లాభదాయకమైన వ్యాపారాన్ని నడుపుతోంది. అదే ఆమెకు మరింత ఉత్సాహాన్ని ఇస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com