హాథ్రస్‌ పిటిషన్‌పై సుప్రీం కోర్టులో విచారణ

హాథ్రస్‌ పిటిషన్‌పై సుప్రీం కోర్టులో విచారణ
X

హాథ్రస్‌ అత్యాచార ఘటన దిగ్భ్రాంతికరమని.. ఈ ఘోరంపై పదేపదే వానదలు వినాలనుకోవడం లేదని.. దేశ అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. హాథ్రస్ ఘటనపై దాఖలైన పిటిషన్‌పై సుప్రీం కోర్టు మంగళవారం విచారణ జరిపింది. ఈ కేసులో సాక్ష్యులకు ఎలాంటి రక్షణ కల్పిస్తున్నారని యూపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అటు బాధిత కుటుంబం న్యాయవాదిని ఏర్పాటు చేసుకుందా లేదా అని ప్రశ్నించింది. దీనిపై బుధవారంలోగా అఫిడవిట్‌ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. అయితే.. తాము గురువారం అఫిడవిట్‌ దాఖలు చేస్తామని యూపీ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు తెలిపింది. దీంతో తదుపరి విచారణను న్యాయస్థానం వచ్చే వారానికి వాయిదా వేసింది.

హాథ్రస్‌ ఘటనకు సంబంధించి యూపీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో తన వాదనలు వినిపించింది. హాథ్రస్‌ కేసులో ఎన్నో అవాస్తవ కథనాలు వినిపిస్తున్నాయని.. వాటిని అరికట్టాలని యూపీ తరపున సొలిసిటర్ జనరల్‌ తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు. కొందరు తమ స్వార్ధ ప్రయోజనాల కోసమే ఇలాంటివి సృష్టిస్తున్నారని.. ఆయన ఆరోపించారు. వీటిని అరికట్టేలా హాథ్రస్‌ కేసులో సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని న్యాయస్థానాన్ని కోరారు.

అత్యాచార బాధితురాలికి .. అర్థరాత్రి అంత్యక్రియలు నిర్వహించడంపై... యూపీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. మరుసటి రోజు శాంతి భద్రతలకు ముప్పు తలెత్తే అవకాశం ఉందన్న ఇంటెలిజెన్స్‌ నివేదిక కారణంగానే.. రాత్రి అంత్యక్రియలు నిర్వహించాల్సి వచ్చిందని కోర్టుకు తెలిపింది. ఈ ఘటనలో దాడికి గురైన 19 ఏళ్ల యువతి.. సెప్టెంబర్ 29న ఉదయం ఢిల్లీలోని సఫ్దర్‌ జంగ్ ఆసుపత్రిలో మరణించగా... ఆమె మృతదేహాన్ని... అదే రోజు రాత్రి రెండున్నరకు కుటుంబ సభ్యులు లేకుండానే అంత్యక్రియలు నిర్వహించారు.

అత్యాచార ఘటనపై విచారణ జరిపేందుకు... సీఎం యోగీ నియమించి ప్రత్యేక సిట్‌ బృందం.. హాథ్రస్‌లో పర్యటించింది. క్రైమ్ సీన్‌ను అధికారులు పరిశీలించారు. ఈ బృందం తన నివేదికను ప్రభుత్వానికి బుధవారం అందజేయనుంది. హాథ్రస్‌ అత్యాచార ఘటనను యూపీ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోలేదని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో.... యోగీ ప్రభుత్వం ప్రత్యేక సిట్ ఏర్పాటు చేసింది. ముగ్గురు సభ్యులున్న ఈ ప్యానెల్‌.. యూపీ హోంశాఖ కార్యదర్శి భగవాన్ స్వరూప్‌ నేతృత్వంలో ఏర్పాటైంది. ఈ బృందంలో డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ చంద్రప్రకాశ్‌, ఐసీపీ ఆఫీసర్‌ పూనమ్‌లున్నారు.

హాథ్రస్‌ ఘటనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సీరియస్‌ అయ్యారు. బాధితురాలి కుటుంబాన్ని బెదిరించారని ఆరోపించారు. దేశంలో ఏ మహిళలకు అన్యాయం జరిగినా వెళ్తానన్నారు. తనను కిందపడేశారని బాధలేదన్నారు రాహుల్‌ గాంధీ.

Tags

Next Story