యూపీ, ఢిల్లీలో హాథ్రస్ అత్యాచార ఘటన ప్రకంపనలు

హాథ్రస్ అత్యాచార ఘటన ప్రకంపనలు సృష్టిస్తోంది. యూపీ, ఢిల్లీలో విపక్షాల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో.. హాథ్రస్ గ్రామంలో మరింత భద్రతను పెంచారు. ఇప్పుడా గ్రామం అంతా పోలీసు వలయంలో ఉంది. ఎలాంటి ఘర్షణలు జరగకుండా 144 సెక్షన్ కొనసాగుతోంది. అటు.. వైపు ఎవరూ వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. అత్యాచారానికి గురైన దళిత యువతి కుటుంబ సభ్యుల్ని పరామర్శించేందుకు... హాథ్రస్ వెళ్లే ప్రయత్నం చేసిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీల బృందాన్ని పోలీసులు అడ్డుకున్నారు. వారంతా ఢిల్లీ నుంచి బయలుదేరి హాథ్రస్ చేరుకునేందుకు ప్రయత్నించారు. అయితే హాథ్రస్‌లో అడుగుపెట్టకుండా... పోలీసులు నిలిపివేశారు.
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఓ బ్రెయిన్‌తోపాటు.. పలువురు నేతలు, కార్యకర్తలను... పోలీసులు అనుమతించలేదు. దీంతో ఆ పార్టీ నేతలకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. బాధితురాలి కుటుంబాన్ని కలుస్తామని... తృణమూల్ నేతలు విజ్ఞప్తి చేసినా.. పోలీసులు పట్టించుకోలేదు. బాధితురాలి ఇంటికి కేవలం ఒకటిన్నర కిలోమీటర్ దూరంలోనే వారిని అడ్డుకున్నారు. పోలీసులతో జరిగిన తోపులాటలో ఎంపీ ఓబ్రెయిన్ కిందపడ్డారు.
అటు ఢిల్లీలోనూ.. AICC కార్యాలయం వద్ద కాంగ్రెస్ నేతలు ధర్నాకు దిగారు. హాథ్రస్ వెళ్లేందుకు ప్రయత్నించిన రాహుల్, ప్రియాంకలను అడ్డుకోవడాన్ని వారు తప్పుబట్టారు. అత్యాచార బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ధర్నా చేస్తున్న కాంగ్రెస్ నేతల్ని పోలీసులు అదుపులోకి తీసుకుని బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించాలంటూ నినాదాలు చేశారు.
యూపీలో హాథ్రస్ అత్యాచార ఘటనపై.. విపక్షాల నిరసనలు కొనసాగాయి. లక్నోలో.. సమాజ్‌వాదీ పార్టీ నేతలు ఆందోళనకు దిగారు. ప్రభుత్వ వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆందోళన చేస్తున్నవారిని పోలీసులు బలవంతంగా వాహనాల్లో ఎక్కించి అక్కడి నుంచి తరలించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com