తమిళనాడులో వేడెక్కుతున్న రాజకీయాలు!

తమిళనాడులో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. శశికళ జైలు నుంచి విడుదలైన తర్వాత రాజకీయాలు మరింత రసవత్తరగా మారాయి. ఈనెల 7న బెంగళూరు నుంచి శశికళ చెన్నైకి రానున్న నేపథ్యంలో ఏం జరుగుతుందోనని చర్చలు నడుస్తున్నాయి. ఈనెల 7న జయలలిత సమాధి వద్దకు వెళ్లాలని చిన్నమ్మ నిర్ణయించగా, ఆ కార్యక్రమాన్ని ఎలాగైనా అడ్డుకునేందుకు అధికార అన్నాడీఎంకే విశ్వ ప్రయత్నాలు చేస్తోంది.. ఎట్టి పరిస్థితుల్లో జయలలిత సమాధి వద్దకు శశికళను రానివ్వకూడదనే ఆలోచన చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగానే 15రోజులపాటు జయలలిత సమాధి సందర్శనను నిలిపివేస్తున్నట్లు ప్రకటించి చిన్నమ్మకు షాక్ ఇచ్చింది తమిళనాడు ప్రభుత్వం.
అయితే, ఇందులో ఎలాంటి రాజకీయాలు లేవని, కేవలం సమాధికి తుది మెరుగులు దిద్దడం కోసమే ఈనిర్ణయం తీసుకున్నామని పళని ప్రభుత్వం చెబుతుండగా.. కావాలనే సందర్శన నిలిపివేశారని శశికళ వర్గం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.. ఎట్టి పరిస్థితుల్లో ఆదివారం జయలలిత సమాధి దగ్గరకు వెళ్లి తీరుతామని తెగేసి చెబుతోంది.. అటు ప్రభుత్వం కూడా నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరిస్తోంది.. మొత్తంగా చిన్నమ్మకు చెక్ పెట్టేందుకు అన్నాడీఎంకే భారీగానే ఎత్తుగడలు వేస్తున్నట్లు కనిపిస్తోంది.
అటు జైలు శిక్ష అనుభవించి విడుదలైన శశికళకు స్వాగతం పలుకుతూ చెన్నైలో పోస్టర్లు కనిపించడం కలకలం రేపుతోంది.. అన్నాడీఎంకే శాశ్వత ప్రధాన కార్యదర్శి శశికళకు స్వాగతమంటూ ఆ పార్టీ నేత ఏసీ శేఖర్ పేరుతో పోస్టర్లు నగరంలో ప్రత్యక్షమయ్యాయి.. అన్నాడీఎంకే నేతల్లో కొందరు చిన్నమ్మ చెంతకు చేరతానే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. మంత్రి జయకుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతంలో పోస్టర్లను చూసి అన్నాడీఎంకే నేతలు తీవ్రంగా చర్చించుకుంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com