మధ్యప్రదేశ్ లో వరదలు.. ఎనిమిదిమంది జలసమాధి

మధ్యప్రదేశ్ రాష్ట్రాన్ని వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. ఇప్పటికే ఎనిమిది మంది జలసమాధి అయ్యారు. దాదాపు 9 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వారందరినీ రిలీఫ్ క్యాంప్‌లలో రక్షణ కల్పిస్తున్నారు. గురువారం నుంచి కురుస్తున్న కుండపోత వానలతో వరదలు ముంచెత్తుతున్నాయి. రాష్ట్రంలోని 12 జిల్లాలు పూర్తిగా జలమయం అయ్యాయి. 9 జిల్లాల్లో 394కుపైగా గ్రామాలు వరదలకు ప్రభావితమయ్యాయి.. కొన్ని చోట్ల గ్రామాలకు గ్రామాలనే వరద నీరు కప్పేసింది. దీంతో పల్లెల ఆనవాళ్లు కూడా కనిపించని పరిస్థితి. దాదాపు 40 గ్రామాల్లో 1200 మంది ప్రజలు చిక్కుకుపోయారు. వారందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేస్తున్నాయి సహాయ బృందాలు. ఇప్పటి వరకు 8వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు.
వరదలు ముంచెత్తుతున్న నేపథ్యంలో ప్రభుత్వం సహాయ చర్యలు ముమ్మరం చేసింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఏరియల్ సర్వే చేపట్టారు. ఐదు జిల్లాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన హెలికాప్టర్ నుంచి పరిశీలించారు. వరదల పరిస్థితిని, సహాయక కార్యక్రమాలను స్వయంగా తెలుసుకున్నారు.. హోసంగాబాద్, ఇతర జిల్లాల్లో ఏరియల్ సర్వే జరిపారు. అనంతరం వరద పరిస్థితులపై సమీక్షించేందుకు అత్యున్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అంతకు ముందు రాష్ట్రంలోని వరద పరిస్థితిని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ వివరించారు.
వరదలు చుట్టుముట్టడంతో చాలా మంది గ్రామాల్లో చిక్కుకుపోయారు. వారిలో కొంతమందిని ఇప్పటికే ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన ఎంఐ-17 వీ5 హెలికాప్టర్ ద్వారా కాపాడారు. వెన్‌గంగా నదీ తీరంలోని మోవాడ్ గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులను ఎయిర్ ఫోర్స్ సిబ్బంది రక్షించారు. వారందరినీ సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఇక శివ్‌నా నదిలో వరద ఉధృతి భారీగా పెరగడంతో పరివాహక ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.. మందాసుల్ ప్రాంతంలోని పశుపతినాథ్ ఆలయంలోకి వరద నీరు చేరింది.. దీంతో శివలింగం దాదాపు సగం మునిగిపోయింది.
మరో 48 గంటలపాటు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.. ఇండోర్, ఉజ్జయిని, షాజాపూర్, రత్లం, దేవాస్, అలీరాజ్‌పూర్, మాండ్‌సౌర్, చీముచ్‌లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారులు తెలిపారు. దీంతో నర్మదా నది, దాని ఉపనదుల వద్ద అధికారులు అప్రమత్తమయ్యారు. ఇక గుజరాత్‌లోనూ పలు ప్రాంతాలను భారీ వర్షాలు, వరదలు ముంచెత్తుతున్నాయి.. నదుల్లో ప్రమాద స్థాయిలో నీటి ప్రవాహం కొనసాగుతోంది.. సియోని జిల్లాలో వరదలకు నూతనంగా నిర్మించిన వంతెన కొట్టుకుపోయింది.. మూడున్నర కోట్ల వ్యయంతో ఈ వంతెనను నిర్మించగా.. నిర్మాణం పూర్తయినట్లు ఆదివారమే ప్రకటించారు అధికారులు.. అయితే, ప్రకటన చేసిన కొద్దిగంటలకే వంతెన కుప్పకూలిపోయింది.. వైన్ గంగా నదిలో భారీ వరదలకు పిల్లర్లు కూడా నేలమట్టమయ్యాయి. వంతెన కూలిపోవడంతో సున్వారా, భీమ్‌గఢ్ గ్రామాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com