Mumbai Rains: ముంబైలో భారీ వర్షాలు.. ముందే వచ్చిన రుతుపవనాలు..

Mumbai Rains: నైరుతి రుతుపవనాలు మహారాష్ట్ర తీరం వైపు దూసుకెళుతుండగా, గత రాత్రి ముంబై నగరంలో భారీ వర్షాలు కురిశాయి. "ప్రతి సంవత్సరం రుతుపవనాలు సాధారణ రాక తేదీ జూన్ 10. అయితే ఈసారి రుతుపవనాలు రెండు రోజులు ముందుగానే వచ్చి ముంబై నగర వాసుల్ని పలకరించాయి అని ముంబై డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (డిడిజి) డాక్టర్ జయంతా సర్కార్ చెప్పారు.
జూన్ 9 నుంచి జూన్ 12 వరకు ముంబై, థానే, రాయ్‌గడ్, కొంకణ్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ముంబైలోని వివిధ ప్రాంతాలు మరియు దాని శివారు ప్రాంతాలు ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉన్నందున బృహన్ ముంబై కార్పొరేషన్ (బిఎంసి) రుతుపవనాల సన్నద్ధతపై అత్యవసర సమావేశం నిర్వహించింది.
ఈ రోజు (జూన్ 9) ఉదయం 11:50 గంటలకు 4.22 మీటర్ల ఎత్తైన ఆటుపోట్లు తీరాన్ని తాకే అవకాశం ఉంది. ముంబై అరేబియా సముద్రానికి ఎదురుగా ఉన్న తీరం అంచున ఉన్నందున, అధిక ఆటుపోట్లకు గురవుతుంది. మత్స్యకారులు జూన్ 9 నుండి జూన్ 12 వరకు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.
ముంబైలో కొలాబా, మహాలక్ష్మి, మరియు దాదర్ ప్రాంతాలలో 20 మి.మీ నుండి 40 మి.మీ వరకు వర్షం కురిసింది. ఉత్తర ముంబైలోని చిన్చోలి, బోరివాలి, దహిసార్ సహా కొన్ని వాతావరణ స్టేషన్లలో మంగళవారం 60 మి.మీ వర్షపాతం నమోదైంది.
గత నెల తౌక్తే తుఫానుతో ముంబై నగరం అతలాకుతలమైంది. ఆ సమయంలో స్థానిక రైలు సర్వీసులు కూడా దెబ్బతిన్నాయి. ప్రతి సంవత్సరం వర్షాకాలంలో ముంబై నగరంల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటుంది. ఈ సంవత్సరం ముందుగానే సమస్య తీవ్రతను గుర్తించి పరిష్కరించేందుకు BMC సిద్ధంగా ఉంటుందని నగర వాసులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com