హెలికాప్టర్ కూలి పైలెట్ దుర్మరణం

ఉత్తరప్రదేశ్‌లోని అజామ్‌గర్‌లో సోమవారం (సెప్టెంబర్ 21) ఉదయం 11.20 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. అజామ్ నగర్ సమీపంలోని సంజయ్‌పూర్‌లో పంట పొలాల మధ్య హెలికాప్టర్ కూలిపోయింది. ప్రమాద సమయంలో చాపర్‌లో మొత్తం నలుగురు వ్యక్తులు ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో ఇద్దరు హెలికాప్టర్ క్రాష్ అవడానికి ముందే పారాచూట్ సాయంతో కిందకు దూకేశారు. హెలికాప్టర్ కూలిన ఘటనకు సంబంధించిన సమాచారం అందగానే అజామ్‌నగర్ పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. ప్రమాదానికి గురైన హెలికాప్టర్ శిక్షణకు సంబంధించిందని వారు తెలిపారు. హెలికాప్టర్ కూలిపోయిన విషయం తెలియగానే స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. ప్రమాదానికి గురైన హెలికాప్టర్ అమేథీలోని ఇందిరా గాంధీ జాతీయ ఉడాన్ అకాడమీకి చెందినదిగా పీటీఐ పేర్కొంది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఈ సంస్థ విమానాలను నడిపించడంలో శిక్షణ అందిస్తుంది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనపై విచారణకు ఆదేశించినట్లు అధికారులు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com