రజనీకాంత్ సతీమణికి హైకోర్టు నోటీసులు..

రజనీకాంత్ సతీమణికి హైకోర్టు నోటీసులు..
X
తాజాగా ఈ వివాదానికి సంబంధించి మద్రాసు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

అద్దెకు తీసుకుని 'ఆశ్రమ్' పేరుతో పాఠశాలను నడుపుతున్నారు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సతీమణి లత. అయితే అద్దె చెల్లింపు విషయంలో చాలా కాలం నుంచి వివాదం కొనసాగుతోంది. తాజాగా ఈ వివాదానికి సంబంధించి మద్రాసు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. శ్రీ రాఘవేంద్ర విద్యా సంఘం కార్యదర్శి లతా రజనీకాంత్ స్థానిక గిండి ప్రాంతంలో వెంకటేశ్వర్లు, పూర్ణ చంద్రరావులకు చెందిన స్థలాన్ని అద్దెకు తీసుకుని అక్కడ పాఠశాలను నడుపుతున్నారు.

2018లో జరిగిన చర్చల్లో ఇరువురు ఒక ఒప్పందానికి వచ్చారు. 2020లో ఏప్రిల్‌లో స్థలం ఖాళీ చేస్తామని స్థలం సొంతదారుడికి మాట ఇచ్చారు. అయితే ఇప్పటి వరకు ఖాళీ చేయకపోవడంతో స్థలం సొంతదారులు అద్దె బకాయి రూ.2 కోట్లు చెల్లించి, ఆ తరువాత ఖాళీ చేసేలా ఆదేశించాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. చాలా కాలంగా విచారణలో ఉన్న కేసు మంగళవారం మరోసారి విచారణకు వచ్చింది. దీంతో ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి 2021 ఏప్రిల్ లోగా పాఠశాలను అక్కడి నుంచి తొలగించాలని ఉత్తర్వులు జారీ చేశారు.

అలా కాని పక్షంలో కోర్టు ధిక్కార కేసులో తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించి లతకు నోటీసులు జారీ చేశారు. అదేవిధంగా ఆ పాఠశాలలో 2021-22 సంవత్సరానికి గాను విద్యా విధానాన్ని కొనసాగించరాదని ఆదేశించారు. అయితే కరోనా కారణంగానే ఈ ఏడాది పాఠశాల ఖాళీ చేయలేకపోయామని తల కోర్టుకు వివరణ ఇచ్చుకున్నారు. పాఠశాల స్థలం సొంతదారులకు బకాయి ఉన్నామనడం అవాస్తవమని, ఆ వాదనలో నిజం లేదని ఆమె అన్నారు. అద్దె ఎప్పటికప్పుడు చెల్లిస్తున్నామని లతా రజనీకాంత్ వివరించారు.

Tags

Next Story