ఇంట్లో ఆమెని ఎవరు కొట్టినా నీదే తప్పు: అతడిపై ధర్మాసనం ఆగ్రహం

ఖర్మ.. కొట్టకపోయినా కొట్టానని అబద్దం చెప్తావా.. కోర్టుకు వెళ్తానంటావా.. అని ఇకపై భార్యమీద అరవడానికి లేదు పురుషులకు.. ఆమెకు అనుకూలంగా సుప్రీం కోర్టు తీర్పు.. కొట్టేందుకు భర్తే కానక్కరలేదు.. ఎవరు కొట్టినా అతడిదే బాధ్యత అని తీర్పు చెప్పింది ధర్మాసనం. ఈ తీర్పు వెనుకనున్న పూర్వాపరాలు పరిశీలిస్తే.. పంజాబ్‌కు చెందిన ఓ వ్యక్తి వేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఈ విధంగా తీర్పు చెప్పింది.
గత ఏడాది లుధియానాకు చెందిన ఓ మహిళ తనను భర్త సహా అత్తింటి వారు వేధిస్తున్నారని, తీవ్రంగా కొడుతున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు అతడిని అరెస్ట్ చేయకుండా ఉండేదుకు ముందస్తుగా పంజాబ్, హర్యానా కోర్టును ఆశ్రయించాడు. విచారణ సందర్భంగా చీఫ్ జస్టిస్ ఎస్ఏ బోబ్డేతో కూడిన ధర్మాసనం అతడిపై తీవ్రంగా మండిపడింది. నువ్వేం మనిషివి.. తనను చంపడానికి ప్రయత్నించావని నీ భార్య చెబుతోంది. మీరు కొట్టడంవల్లే తనకు గర్భస్రావం అయిందని చెప్పింది.
భార్యను క్రికెట్ బ్యాట్‌తో కొడతావా.. నువ్వేం మనిషివి అని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. భర్త కూడా తన వాదన తాను వినిపించుకున్నాడు. తన భార్యకు తగిలిన గాయాలకు తాను కారణం కాదని, తన తండ్రి కారణమని అన్నాడు. తనను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ ఇప్పించాలని సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. అయితే కోర్టు అతడి వాదనను తోసిపుచ్చింది. అత్తవారింట్లో ఎవరి వలన ఆమె గాయపడినా అందుకు కారణమైన వ్యక్తి భర్తే అని, అతడే ప్రధాన బాధ్యత వహించాలని దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు చెప్పింది. ముందస్తు బెయిల్ పిటిషన్‌ని కూడా కొట్టివేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com