వ్యాక్సిన్ మిక్సింగ్ మంచిదే - ICMR

Covaxin and Covishield vaccines: కరోనా కట్టడికి ప్రపంచ వ్యాప్తంగా పరిశోధనలు చేసి....వివిధ కంపెనీలు వ్యాక్సిన్‌లను తయారుచేశాయి. వీటిల్లోకొన్ని కోవిడ్‌పై అత్యంత సమర్ధవంతంగా పనిచేస్తుండగా..... మరికొన్ని సాధారణ ఫలితాల ఇస్తున్నాయి. అయితే ముందు వేసుకున్న టీకానే.. తర్వాత వేసుకోవాలా..? లేదంటే ముందు ఒకటి.. తర్వాత మరొకటి వేసుకుంటే మంచిదా అన్న సందేహాలకు సమాధానం కలనుగొనేందుకు పరిశోధనలు జరుగుతున్నాయి. మిక్స్‌డ్ డోసు తీసుకుంటే మెరుగైన ఫలితాలు వస్తాయని అంటున్నారు నిపుణులు.
కరోనా వైరస్ మహమ్మారిని దీటుగా ఎదుర్కొనేందుకు రకరకాల టీకాలను కలిపి ఇచ్చే విధానంపై ప్రపంచ వ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఆస్ట్రాజెనెకా, ఫైజర్‌పై బ్రిటన్‌లో అధ్యయనాలు జరుగుతుండగా.. భారత్‌లోనూ కొవాగ్జిన్, కొవిషీల్డ్‌పై పరిశీలన చేపట్టారు. ఇందులో భాగంగా వేర్వేరుగా కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలను తీసుకోవడం సురక్షితమని భారత వైద్య పరిశోధనా మండలి చేపట్టిన (ICMR) అధ్యయనం ద్వారా తెలుస్తోంది. దీంతో పాటు వైరస్‌ను సమర్థంగా ఎదుర్కొనే రోగనిరోధక శక్తిని పెంపొందించడంలోనూ మెరుగైన ఫలితాలు ఇచ్చాయని నిపుణులు గుర్తించారు. అయితే, ఈ అధ్యయన నివేదిక అంతర్జాతీయ శాస్త్ర పరిశోధన పత్రికల్లో సమీక్ష పూర్తి చేసుకోవాల్సి ఉంది.
భారత్‌లో విస్తృతంగా అందుబాటులో ఉన్న కొవిషీల్డ్, కొవాగ్జిన్ వ్యాక్సిన్‌లు రెండు వేర్వేరు సాంకేతికతతో అభివృద్ధి చేశారు. ముఖ్యంగా భారత్ బయోటెక్ రూపొందించిన కొవాగ్జిన్ టీకా ఇన్‌యాక్టివేటెడ్ వైరస్‌ను ఉపయోగించి తయారు చేయగా.. కొవిషీల్డ్ మాత్రం ఎడినో వైరస్ వెక్టార్ సాంకేతికతతో అభివృద్ధి చేశారు. అయితే, దేశంలో రెండు నెలల క్రితం కొవిషీల్డ్, కొవాగ్జిన్ వ్యాక్సిన్‌లను ఒకే వ్యక్తికి రెండు వేర్వేరుగా ఇచ్చిన ఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఇది నిబంధనలకు విరుద్ధంగా జరిగినప్పటికీ వీటి పనితీరుపై ఐసీఎంఆర్ నిపుణులు అధ్యయనం చేపట్టారు. ఇందులో భాగంగా ఒకేవ్యక్తి వేర్వేరు డోసుల్లో రెండు వ్యాక్సిన్లను తీసుకోవడం సురక్షితమేనని తేలింది. అంతేకాకుండా వైరస్‌ను నిరోధించే మెరుగైన ఇమ్యూనిటీని కూడా పొందవచ్చని వెల్లడైంది. వ్యాక్సిన్‌ల కొరత వంటి సవాళ్లు ఎదురైన సందర్భంలో ఇలాంటి మిశ్రమ పద్ధతిలో టీకాలు ఇచ్చే విధానం దోహదపడవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
కొవిషీల్డ్, కొవాగ్జిన్ వ్యాక్సిన్‌లను మిశ్రమ పద్ధతిలో వాడడం, వాటి ఫలితాలను అంచనా వేసేందుకు ఓ అధ్యయం చేపట్టాలని కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (CDCSO) నిపుణుల కమిటీ బృందం జులై 30వ తేదీన సిఫార్సు చేసింది. ఇందులో భాగంగానే వీటిపై అధ్యయనం కొనసాగుతోంది. ఇదిలాఉంటే, భిన్న తయారీ సంస్థలు అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్‌లను మిక్సింగ్, మ్యాచింగ్ విధానంలో ఇవ్వడం సరైన పద్ధతి కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది. ఇలాంటి వాటిపై తక్కువ సమాచారం ఉన్నందున ఈ విధానం ప్రమాదకరమని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో తాజా అధ్యయనం మెరుగైన ఫలితాలే ఇచ్చినప్పటికీ దీనిపై నిపుణుల సమక్షంలో పూర్తి సమీక్ష జరగాల్సి ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com