ఢిల్లీలో ఆక్సిజన్ కొరతపై తీవ్రంగా స్పందించిన హైకోర్టు..!

ఢిల్లీలో ఆక్సిజన్ కొరతపై అక్కడి హైకోర్టు తీవ్రంగా స్పందించింది.. తమకు ఆక్సిజన్ అందకపోవడంపై ఢిల్లీలోని పలు ఆస్పత్రుల యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించాయి.. దీనిని తీవ్రంగా పరిగణించిన ఢిల్లీ హైకోర్టు ఎవరైనా ఆక్సిజన్ సప్లయిని అడ్డుకుంటే ఉరితీస్తామంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది.. 480 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌కు గాను 297 మెట్రిక్ టన్నులు మాత్రమే తమకు అందిందని ఢిల్లీ ప్రభుత్వం హైకోర్టు దృష్టికి తీసుకెళ్లింది.. రాష్ట్రాలకు ఆక్సిజన్ సప్లై వివరాలను కేంద్రం అఫిడవిట్ రూపంలో అందజేయాలని కోర్టు ద్వారా ఢిల్లీ ప్రభుత్వం కోరింది.
తక్షణమే ఢిల్లీకి 480 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అందకపోతే వ్యవస్థ కుప్పకూలిపోయే ప్రమాదం ఉందంటూ కీలక వ్యాఖ్యలు చేసింది.. అయితే, ఢిల్లీకి ఆక్సిజన్ అందకుండా ఎవరు ఏరకంగా అడ్డుకుంటున్నారో వివరాలు ఇవ్వాలని ఢిల్లీ ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది.. ఢిల్లీకి ఆక్సిజన్ విషయంలో అడ్డుకుంటున్న అధికారులపై కేంద్రానికి సమాచారం ఇస్తే, వారే చర్యలు తీసుకుంటారని స్పష్టం చేసింది.. అయితే, ఆక్సిజన్ తరలింపు కోసం ఇతర రాష్ట్రాలు సొంతంగా ట్యాంకర్లను ఏర్పాటు చేసుకుంటే ఢిల్లీ ప్రభుత్వం మాత్రం ఆ బాధ్యత మొత్తాన్ని కేంద్రంపైనే వేసిందని సొలిసిటర్ జనరల్ తుషార మెహతా కోర్టుకు వివరించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com