India GDP: భారత వృద్ధి రేటులో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ మరోసారి కోత

India GDP: భారత వృద్ధి రేటులో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ మరోసారి కోత
India GDP: ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కరోనా కుప్పకూల్చడంతో ఆర్థిక మాంద్యం నుంచి తప్పించుకునేందుకు వివిధ దేశాలు పెద్ద ఎత్తున ప్యాకేజీలను ప్రకటించాయి.

India GDP: ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కరోనా కుప్పకూల్చడంతో ఆర్థిక మాంద్యం నుంచి తప్పించుకునేందుకు వివిధ దేశాలు పెద్ద ఎత్తున ప్యాకేజీలను ప్రకటించాయి. దీని నుంచి బయటపడి ఊపిరి తీసుకుంటున్న సమయాన రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. ఈ రెండు పరిణామాల వలన ఆహార ధాన్యాలు, చమురు ధరలు పెరిగి అన్ని దేశాలలో ద్రవ్యోల్బణం విజృంభించింది. దీంతో ప్రజల ఆదాయం పడిపోయి ప్రపంచవ్యాప్తంగా వృద్ధి మందగించిందని వేరు వేరు నివేదికలు చెబుతున్నాయి.

భారత వృద్ధి రేటులో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ మరోసారి కోత విధించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ వృద్ధి రేటు 6.8 శాతం ఉండొచ్చని అంచనా వేసింది. ఇప్పటికే పలు అంతర్జాతీయ సంస్థలు,ఆర్థిక సంస్థలు వృద్ధి అంచనాలను తగ్గించగా..ఐఎంఎఫ్ కూడా అంచనాల్లో కోత విధిస్తూ పలు కీలక విషయాలను తెలిపింది.అయితే 2021-22 ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు 8.7 శాతంగా నమోదైంది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను దేశం 8.2 శాతం నమోదు చేయొచ్చని జనవరిలో అంచనా వేసింది.


దీంతోపాటు ప్రపంచ ఆర్థిక వృద్ధి రేటు అంచనాలను కూడా ఐఎంఎఫ్ ప్రకటించింది. 2021లో 6 శాతంగా నమోదైన వృద్ధి రేటు ఈ ఏడాది 3.2 శాతం నమోదు కావొచ్చని అంచనా వేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో కేవలం 2.7 శాతంగా నమోదు కావొచ్చని ఐఎంఎఫ్ తెలిపింది. దీనికి కరోనా, రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, చైనాలో లాక్‌డౌన్లు వంటివి ఇందుకు కారణాలుగా వివరించింది.

అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు అయిన అమెరికా, చైనా, యూరోపియన్ యూనియన్లు తీవ్ర ఒడిదొడుకులను ఎదుర్కొంటున్నాయి. ఇది 2023లో ప్రపంచ మాంద్యానికి దారి తీసే అవకాశం ఉందని ఐఎంఎఫ్ అంచనా వేస్తోంది. ఇప్పటికే చైనాలో రియల్ఎస్టేట్ రంగం కుదేలు అయింది. తరుచూ కోవిడ్ లాక్ డౌన్లతో ఆ దేశం ఇబ్బందులు ఎదుర్కొంటోంది. అన్ని దేశాలు ద్రవ్యోల్భన ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నాయి. చైనా మాన్యుఫాక్చరింగ్ హబ్ గా ఉండటంతో అక్కడి పరిణామాలు ప్రపంచ దేశాలపై ప్రభావాన్ని చూపిస్తున్నాయని ఐఎంఎఫ్ అంచనా వేస్తోంది.

అమెరికాలో ద్రవ్య, ఆర్థిక పరిస్థితులను కఠినతరం చేయడం వల్ల వచ్చే ఏడాది వృద్ధిలో 1 శాతానికి తగ్గుతుందని ఐఎంఎఫ్ అంచనా వేసింది. చైనా వృద్ధి రేటు అంచనాలు 3.2 శాతంగా ఉంటాయని.. ఇది 2021లో 8.1 శాతం వృద్ధి రేటుతో పోలిస్తే చాలా తక్కువ అని ఐఎంఎఫ్ తన నివేదికలో తెలిపింది. ఉక్రెయిన్ పై రష్యా దాడి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అస్థిర పరిచింది. యూరప్ తీవ్రమైన ఇంధన కొరతను ఎదుర్కొంటోంది. ఈ పరిస్థితుల్లో ప్రపంచం అంతా ఆర్థిక మాంద్యం ముప్పును ఎదుర్కొంటోంది. అంతర్జాతీయ పరిస్థితులు క్షీణించడమే జీడీపీలో కోతలకు కారణమని తెలిపింది.

Tags

Read MoreRead Less
Next Story