Bharat-China: భారత్-చైనా సరిహద్దుల్లో మళ్లీ ఘర్షణలు

Bharat-China: భారత్-చైనా సరిహద్దుల్లో మళ్లీ ఘర్షణలు చెలరేగిన నేపధ్యంలో ఇవాళ పార్లమెంటులో తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ నెల 9న అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ సెక్టార్ లో ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణ చోటుచేసుకున్న అంశం ఆలస్యంగా తెలిసింది. సరిహద్దుల వద్ద చోటు చేసుకుంటున్న పరిణామాలపై ప్రతిపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. పార్లమెంటులో తీర్మానం ప్రవేశపెట్టేందుకు సిద్ధమయ్యాయి. ఏఐఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వాయిదా తీర్మానం ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం.
ఇక రెండేళ్ల కింద గాల్వాన్ లోయలో చైనా బలగాలు దురాక్రమణకు దిగడంతో భారత బలగాలు బలంగా అడ్డుకున్నాయి. ఈ సందర్భంగా చోటుచేసుకున్న ఘర్షణలో 20 మంది జవాన్లు వీర మరణం పొందారు. తెలంగాణకు చెందిన కల్నల్ సంతోష్ బాబు అమరుడయ్యారు. చైనా వైపు 45 మంది వరకు హతమయ్యారని అంచనా. అయితే తాజాగా చోటుచేసుకున్న ఘటన అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ వద్ద జరిగింది. ఈ నెల 9 న చెలరేగిన ఘర్షణను ఆర్మీ ఆలస్యంగా తెలిపింది. వాస్తవాధీన రేఖను దాటేందుకు చైనా ఆర్మీ ప్రయత్నించగా, భారత సైనికులు సమర్ధంగా అడ్డుకున్నారు.
మరోవైపు చెలరేగిన ఘర్షణలో ఇరు దేశాల సైనికులకు స్వల్ప గాయాలయ్యాయినట్లు సమాచారం. ఘటనపై ఇరు దేశాల రక్షణ శాఖలు తీవ్రంగా స్పందించి, కమాండర్ల స్థాయిలో ఫ్లాగ్ మీటింగ్ ఏర్పాటు చేశాయి. బార్డర్ లో శాంతి, సామరస్య వాతావరణ పునరుద్ధరణకు తగిన చర్యలు చేపట్టాయి. కాగా, గత కొంత కాలంగా అరుణాచల్ ప్రదేశ్ ని చైనా తన భూభాగమని చెప్తుంది. ఇంతకుముందు చైనాతో జరిగిన యుద్ధంలో వారు సరిహద్దుకు 60 కిలోమీటర్ల దూరంలోని తవాంగ్ అనే పట్టణం వరకు చొచ్చుకుని వచ్చారు. కానీ, తర్వాత వెనుక నుంచి మద్ధతు లేకపోవడంతో వెనక్కి వెళ్లిపోయారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com