Congress Presidential Election: ముగిసిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలు.. కౌంటింగ్ పైనే అందరి దృష్టి

Congress Presidential Election: 137 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ చరిత్రలో కీలక ఘట్టం అధ్యక్ష ఎన్నికలు. పోలింగ్ సోమవారం ఉదయం 10 గంటలకు మొదలై మధ్యాహ్నం 4 గంటలకు ముగిసింది.
ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌తో సహా వివిధ రాష్ట్రాల్లో ఏర్పాటు చేసిన 63 పోలింగ్ కేంద్రాల్లో 9,000 మందికి పైగా పీసీసీ డెలిగేట్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
24 ఏళ్ల తర్వాత గాంధీయేతర కుటుంబం నుంచి అధ్యక్షుడి ఎన్నికలు జరగడం, మల్లికార్జున ఖర్గే, శశిథరూర్ మధ్య పోటీ ఉన్నా వివాదాలు లేకుండా ప్రశాంతంగా, పారదర్శకంగా పోలింగ్ ముగియడంతో ఇండియన్ గ్రాండ్ ఓల్డ్ పార్టీ ఊపిరిపీల్చుకుంది. బ్యాలెట్ బాక్సులో ఫలితాలు నిక్షిప్తం కావడంతో రేపు జరిగే కౌంటింగ్ పైనే అందరి దృష్టి ఉంది.
ఇక కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతుంటారు. అందుకు తగ్గట్టుగానే కీలకమైన అధ్యక్ష ఎన్నికల్లో నెక్ టు నెక్ పోటీ నెలకొనడం, అధిష్ఠానం కూడా ఏ ఒక్కరి వైపు మొగ్గుచూపకుండా నచ్చిన వారిని ఎన్నుకోవాలని, అభ్యర్థులకు ప్రచారం చేయాలంటే ముందు తమ పోస్టులకు రాజీనామా చేయాలని, ఆయా రాష్ట్రాల్లో అభ్యర్థులు ప్రచారానికి వచ్చినప్పుడు పీసీసీ చీఫ్‌లు వారికి అవసరమైన ఏర్పాటు చేయాలని, ప్రచారంలో మాత్రం పాల్గొనరాదని కచ్చితమైన మార్గదర్శకాలు జారీ చేసింది.
క్రమశిక్షణ తప్పితే చర్యలు తప్పవని హెచ్చరించింది. అందుకు తగ్గట్టుగానే ఖర్గే, శశిథరూర్ ఆయా రాష్ట్రాల్లో ప్రచారం సాగించారు. తమ ప్రత్యర్థిపై ఎలాంటి విమర్శ చేయకుండా హుందాగా వ్యవహిరిస్తూ వచ్చారు. పార్టీ టాప్-3 నేతల్లో ఖర్గే ఒకరని శశిథరూర్ ప్రశంసించగా, శశిథరూర్ తన సోదర సమానుడని, విద్యాధికుడని ఖర్గే ప్రశసించారు. ముఖ్యనేతల సపోర్ట్‌ను తాను ఎప్పుడూ ఆశించలేది, కార్యకర్తలే తన బలమని శశిథరూర్ ప్రచారం సాగించగా, అందర్నీ కలుపుకొని వెళ్లడం ద్వారా పార్టీ పటిష్టతకు పాటుపడతానని ఖర్గే ప్రచారం చేశారు.
ఓటింగ్‌కు ముందు కూడా ఖర్గే, థరూర్‌లు ఫోనులో ఒకరికి ఒకరు అభినందనలు తెలుపుకొన్నారు. గెలుపు ఓటములు సహజమని, ఎవరు గెలిచినా, ఎవరు ఓడినా కలిసికట్టుగానే తాము పార్టీ కోసం పనిచేస్తామని శశిథరూర్ కామెంట్ చేశారు
ఇక ఏపీకి సంబందించి కర్నూలులో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో కాంగ్రెస్ నేతలంతా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.పీసీసీ అధ్యక్షుడితో సహా 350 మంది వినియోగించుకున్నారు.తెలంగాణకు సంబందించి కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి ఎన్నిక కోసం గాంధీభవన్‌లో పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో 238 మంది పీసీసీ నేతలు ఓటు హక్కు వినియోగించుకున్నారు.
అధ్యక్ష ఎన్నికల పోలింగ్ కోసం ప్రతి రాష్ట్రానికి ఒక రిటర్నింగ్ అధికారి, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులుగా పలువురు నేతలను కాంగ్రెస్ ఎన్నికల కమిటీ అయా రాష్ట్రాలకు పంపింది. తెలంగాణకు రిటర్నింగ్ అధికారిగా కేరళ నేత రాజమోహన్ ఉన్నితన్, అసిస్టెంట్ రిటర్నింగ్అధికారిగా రాజ బగేల్ వ్యవహరించారు. ఎన్నికల ఏజెంట్లుగా ఖర్గే తరఫున మల్లు రవిలు వ్యవహరించగా. శశిథరూర్ తరఫున ప్రొఫెషనల్ కాంగ్రెస్ నాయకులు కుమ్మరి శ్రీకాంత్, సంతోశ్‌కుమార్ వ్యవహరించారు.
వివిధ రాష్ట్రాల నుంచి బ్యాలెట్ బాక్సులు ఢిల్లీ ఏఐసీసీ కార్యాలయంకు తరలించారు. సీల్ చేసిన బ్యాలెట్ బాక్సులను రేపు పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో సీల్ తీసి, ఓట్లన్నింటినీ క్లబ్బింగ్ చేసి లెక్కింపు ప్రారంభిస్తారు. దీంతో ఏ రాష్ట్రం నుంచి ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు పోలయ్యాయనేది సీక్రెట్‌గానే ఉండిపోతుంది.
కౌంటింగ్ ప్రక్రియ పూర్తి కాగానే ఫలితాలను ప్రకటిస్తారు.పార్టీ అధిష్ఠానం నేరుగా ఏ అభ్యర్థికి మద్దతు ప్రకటించనప్పటికీ ఖర్గే వైపు అధిష్ఠానం మొగ్గుచూపుతుందని సమాచారం.దీంతో ఖర్గే విజయం నల్లేరుమీద నడకేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే, యువనేతల బలాన్నే నమ్ముకున్న శశిథరూర్ కూడా తన గెలుపుపై ఆశాభావంతోనే ఉన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com