Aviation Fuel : ఆవాల మొక్క నుంచి విమాన ఇంధనం.. మన శాస్త్రవేత్త అద్భుతం

Aviation Fuel : ఆవాల మొక్క నుంచి విమాన ఇంధనం.. మన శాస్త్రవేత్త అద్భుతం
Aviation Fuel : అద్భుతం.. అపూర్వం.. చరిత్రలో కనివినీ ఎరుగని అద్వితీయమైన విషయం.

Aviation Fuel : అద్భుతం.. అపూర్వం.. చరిత్రలో కనివినీ ఎరుగని అద్వితీయమైన విషయం. పెట్రోల్ రేట్లు పెరుగుతున్న ఈ సమయంలో ఇలాంటి మాటలు చెవులకు ఇంపుగా ఉంటాయి. అవును. కాకపోతే అవి డుగ్గుడుగ్గుడుగ్గు బళ్లకో.. నాలుగు, ఆరు చక్రాల బళ్లకో కాదు.. అసలామాటకొస్తే.. నేల మీద నడిచే వాహనాలకే కాదు. విమానాలకు మాత్రం ఇది శుభవార్తే. ఎందుకంటే.. విమాన ఇంధనాన్ని (Aviation Fuel) ఆవాల మొక్కల నుంచి తయారుచేస్తామంటున్నారో భారతీయ శాస్త్రవేత్త.

ఎందుకంటే.. విమానయాన రంగానికి ఇంధనం ఖర్చులు బాగా పెరిగిపోయాయి. దీంతో విమానాలను నడపడమే భారంగా మారింది. ఒకవేళ ఛార్జీలు పెంచితే.. ప్రయాణికులే కరువైపోతారు. అందుకే ఏం చేయాలో తలపట్టుకున్న వేళ.. మన భారతీయ శాస్త్రవేత్త పునీత్ ద్వివేది బృందం ఓ అద్భుతమైన విషయాన్ని కనిపెట్టింది. ఆవాల మొక్కలతో విమాన ఇంధనం తయారుచేస్తామని ప్రకటించింది. అది కూడా ఇప్పుడున్న ధరకన్నా చాలా చాలా తక్కువకే.

ఆవాల మొక్కల నుంచి చేసే విమాన ఇంధనం వల్ల.. దాని నిర్వహణ ఖర్చులు తగ్గించడంతోపాటు... వాటి ద్వారా వెలువడే కర్బన ఉద్గారాలను కూడా 68 శాతం తగ్గించొచ్చట. అమెరికాలో వెలువడే కర్బన ఉద్గారాల్లో 2.5 శాతం వాటా విమాన రంగానిదే. అందుకే ఈ ప్రత్యామ్నాయం కోసం ప్రయత్నం చేశారు. నిజంగా ఇది సూపర్ కదా. బ్రాసికా కేరినాటా అనే రకం ఆవాల మొక్కల నుంచి నూనెను తీస్తారు. ఆ నూనె నుంచి విమాన ఇంధనాన్ని తయారుచేయవచ్చని నిరూపించింది పునీత్ ద్వివేది బృందం.

ఆవాల మొక్కతో లీటర్ ఇంధనం ఉత్పత్తికి కేవలం 0.12 డాలర్లు మాత్రమే ఖర్చవుతుంది. అంటే మన రూపాయిల్లో చూస్తే.. దాదాపు 9 రూపాయిలు మాత్రమే. అసలు ఎవరైనా ఊహించగలరా.. విమానానికి అవసరమైన లీటర్ ఇంధనం ఖరీదు 9 రూపాయిలకు తయారుచేయచ్చని. మన బండ్లకు వాడే పెట్రోల్ రేటే ఎప్పుడో వంద రూపాయిలు దాటిపోయింది. ప్రస్తుతం విమాన ఇంధనం కూడా లీటరు దాదాపు 80 రూపాయిలుగా ఉంది. అలాంటిది.. ఇప్పుడు ఇంత చవగ్గా ఇంధనాన్ని తయారుచేస్తామంటే ఎవరు కాదంటారు?

ఆవాల మొక్క నుంచి పెట్రోల్ గురించి చెబుతుంటే.. గతంలో మొక్కల నుంచి పెట్రోల్ ను తయారుచేస్తామన్న రామన్ పిళ్లై గుర్తొస్తారు. కానీ ఆయన చెప్పిన ఫార్ములా వర్కవుట్ కాదని అప్పట్లో శాస్త్రవేత్తలు నిరూపించారు. కానీ మన పునీత్ ద్వివేది విమాన ఇంధనం ఫార్ములా మాత్రం వర్కవుట్ అయ్యేలా ఉంది. ఇది కనుక కార్యరూపం దాల్చితే... మన శాస్త్రవేత్తకూ మంచి పేరు వస్తుంది. ప్రకృతికీ మేలు జరుగుతుంది. అన్నింటికీ మించి ఫ్లైట్ నిర్వాహకులకు, ప్యాసింజర్లకూ లబ్ది చేకూరినట్టే. ఆల్ ది బెస్ట్ పునీత్ ద్వివేది.

Tags

Read MoreRead Less
Next Story