రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలకు మోదీకి ఆహ్వానం..!

భగవత్ రామానుజాచార్యుల సహస్రాబ్దీ ఉత్సవాలకు హాజరుకావాలని ప్రధాని మోదీని చిన్నజీయర్ స్వామి ఆహ్వానించారు. అతిరథ మహారథులను ఆహ్వానించడానికి ఢిల్లీలో పర్యటిస్తున్న స్వామీజీ... సమతామూర్తి విగ్రహావిష్కరణ మహోత్సవ ఆహ్వానపత్రికను మోదీకి అందించారు. సహస్రాబ్ది వేడుకల విశిష్టతను వివరించారు. 216 అడుగుల రామానుజాచార్య పంచలోహ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి తప్పనిసరిగా హాజరు కావాలని కోరారు. జీయర్ స్వామితో పాటు.. మైహోం గ్రూప్ అధినేత జూపల్లి రామేశ్వరరావు కూడా మోదీని కలిసి ప్రాజెక్టు విశేషాలు తెలియజేశారు.
శంషాబాద్ ముచ్చింతల్ ప్రాంతంలో ఏర్పాటు చేయనున్న 216 అడుగుల రామానుజాచార్య పంచలో విగ్రహం విశిష్టతను ప్రధాని మోదీ ఆసక్తిగా తెలుసుకున్నారు. అక్కడ కొలువుదీరనున్న 108 దివ్యదేశాల వివరాలను స్వామీజీ వివరించారు. ప్రపంచ శాంతి కోసం జీయర్ స్వామి చేస్తున్న ప్రయత్నాన్ని ప్రధాని మోదీ అభినందించారు. విగ్రహ ఆవిష్కరణకు తప్పక వస్తానని చెప్పారు.
ఐదు రోజులుగా ఢిల్లీలో ఉన్న జీయర్ స్వామి... ప్రముఖులకు ఆహ్వాన పత్రికలు అందించారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో మంగళవారం భేటీ అయ్యారు. సమతామూర్తి విగ్రహావిష్కరణకు ఆహ్వానించారు. రామ్‌నాథ్ కోవింద్‌కు ఆహ్వానపత్రం అందించారు. రామానుజాచార్య విగ్రహ విశేషాలను వివరించారు. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి తప్పక హాజరవుతానని రామ్‌నాథ్ కోవింద్ చెప్పారు.
రామానుజ విగ్రహ ఆవిష్కరణ మహోత్సవానికి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడును జీయర్ స్వామి ఆహ్వానించారు. కులమతవర్గ ఆర్థిక కారణాలతో సమాజం విచ్ఛిన్నమవుతున్న సమయంలో అందర్నీ ఏకం చేసేందుకే సమతామూర్తిని ఏర్పాటు చేసినట్టు వివరించారు. అనంతరం... పలువురు కేంద్రమంత్రులకు కూడా జీయర్ స్వామి ఆహ్వానపత్రికలు అందించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com