Ambika IPS: 14 ఏళ్లకే పెళ్లి.. ఇద్దరు పిల్లలు.. పది కూడా పాస్ కాలేదు.. అయినా ఐపీఎస్..

Ambika IPS: 14 ఏళ్లకే పెళ్లి.. ఇద్దరు పిల్లలు.. పది కూడా పాస్ కాలేదు.. అయినా ఐపీఎస్..
Ambika IPS: ఆమె పట్టుదల చూసి వైఫల్యం కూడా వెనుకడుగు వేసింది. అంబిక విజయం సాధించింది.

Ambika IPS: అందరి జీవితాలు ఒకేలా ఉండవు.. అందరినీ అవకాశాలు వరించవు.. అవకాశాలు వెతుక్కునేవారు కొందరు.. వచ్చిన అవకాశాన్ని వినియోగించుకునేవారు మరి కొందరు.. ఆ కోవకే చెందుతుంది ఐపీఎస్ అధికారి అంబిక.. ముంబై సింగంగా పేరు తెచ్చుకుని తన వృత్తికి న్యాయం చేస్తోంది.. తనలాంటి మహిళలెందరికో స్ఫూర్తిగా నిలుస్తోంది. తన మీద తనకు నమ్మకం.. వరుసగా మూడు సార్లు విఫలం. అయినా ఏదో ఆశ ఆమెని ముందుకు నడిపించింది.. నాలుగో అటెంప్ట్ లో తన కోరిక ఫలించింది. ఐపీఎస్ అధికారిగా అందరి చేత సెల్యూట్ చేయించుకుంటున్నారు అంబిక.

వరుసగా మూడుసార్లు విఫలమైన తర్వాత, ఆమె భర్త అంబికను ప్రయత్నించింది ఇంక చాలు ఇంటికి వచ్చేయమన్నారు. కానీ అంబిక ఈ ఒక్క ఛాన్స్ ఇవ్వమని ప్రాధేయపడింది. ఆమె పట్టుదల చూసి వైఫల్యం కూడా వెనకడుగు వేసింది. అంబిక విజయం సాధించింది.

సాధారణ వ్యక్తులు కూడా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారనేదానికి బలమైన సాక్ష్యం అంబిక ఐపీఎస్. సమస్యలు లేని జీవితాలు ఉండవు.. కొన్ని పరిష్కరించుకునే సమస్యలైతే.. మరికొన్ని పరిష్కరించుకోలేని సమస్యలు.. అలా అని మీ అభిరుచుల్ని, ఆశయాల్నీ వదిలేసుకోకూడదు.. ప్రయత్నించాలి.. ప్రయత్నించి ఓడిపోయినా సంతృప్తి మిగులుతుంది.. మీ నమ్మకం బలంగా ఉంటే అదే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది అంటారు అంబిక.


తమిళనాడుకు చెందిన అంబికకి 14 ఏళ్ల వయసులోనే పోలీస్ కానిస్టేబుల్‌తో వివాహం జరిగింది. పెళ్లయిన నాలుగేళ్ల తర్వాత 18 ఏళ్ల వయసులో ఇద్దరు పిల్లలకు తల్లి కూడా అయింది. కుటుంబ బాధ్యతలు, సంసారం.. అయినా ఏదో అసంతృప్తి.. ఏదో చేయాలన్న తపన..

ఒకరోజు అంబిక తన భర్తతో కలిసి రిపబ్లిక్ డే వేడుకలకు వెళ్లింది. తన భర్త అధికారులకు సెల్యూట్ చేయడం చూసింది. ఇంటికి వచ్చాక అడిగింది.. ఎందుకు మీరు వాళ్లకు సెల్యూట్ చేస్తున్నారు. మీకంటే వయసులో చిన్నగా కనిపిస్తున్నారు కదా అయినా వంగి వంగి నమస్కారం చేస్తున్నారు ఎందుకు అని ప్రశ్నించింది.

అంబిక అడిగిన ప్రశ్నకు, ఆమె భర్త వాళ్లంతా తన సీనియర్ అధికారులు, ఐపిఎస్ అధికారులు అని చెప్పాడు. వెంటనే అంబిక తాను కూడా ఐపీఎస్ అవుతానని అంది భర్తతో.. పదోతరగతి కూడా పాస్ కాలేదు.. ఐపీఎస్ ఎలా అవుతావు.. ముందు టెన్త్ పూర్తి చేయి అని ఆమె ఆశలకు బలం చేకూర్చారు.
భర్తని, ఇద్దరు పిల్లలను, అత్తమామలను చూసుకుంటూనే ఒక ప్రైవేట్ ఇన్‌స్టిట్యూట్‌లో చదివి 10, 12 ఉత్తీర్ణత సాధించింది. ఆపై గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి చేసింది. IPS అధికారి కావాలంటే సివిల్స్ రాయాలి. దాని కోసం ఆమె తన ఇద్దరు పిల్లలను, భర్తను అత్తమామలకు అప్పజెప్పి కోచింగ్ కోసం అని చెన్నై వెళ్ళింది. మూడుసార్లు సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాసింది.

వరుసగా మూడుసార్లు విఫలమైన తర్వాత, ఆమె భర్త అంబికను ఇంటికి తిరిగి రావాలని అభ్యర్థించాడు. కానీ అంబిక చివరిసారిగా పరీక్ష రాయడానికి భర్త అనుమతి కోరింది. అతడి అనుమతితో అంబిక నాలుగోసారి పరీక్ష రాసి ఉత్తీర్ణత సాధించింది. ఐపీఎస్ అధికారిణి అయింది. అంబికకు తొలి పోస్టింగ్ మహారాష్ట్రలో వచ్చింది. ప్రస్తుతం ఆమె ముంబైలో DCP పోస్ట్‌లో పని చేస్తోంది. ఇప్పుడు ఆమెను అందరూ లేడీ సింగం అని పిలుస్తారు. పట్టుదల ఉంటే ఎన్ని అడ్డంకులు ఎదురైనా అధిగమించవచ్చనేదానికి అంబిక స్ఫూర్తిగా నిలుస్తారు.

Tags

Next Story