ఢిల్లీ విలయానికి బ్రిటన్ వేరియంటే కారణమా..?

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ మహమ్మారి విలయతాండవం చేస్తోంది. అయితే, కొన్ని వారాల్లోనే ఒక్కసారిగా పెరిగిన ఉద్ధృతికి బ్రిటన్ రకం వేరియంట్ కారణం కావచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. మార్చి నెలలో జరిపిన శాంపిళ్ల విశ్లేషణలో 50శాతం బ్రిటన్ వేరియంట్‌వే కావడం దీనికి నిదర్శనమని అంచనా వేశారు నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ నిపుణులు. దేశంలో కరోనా వేరియంట్స్, వాటి ప్రభావాన్ని అంచనా వేసేందుకు జాతీయ అంటువ్యాధుల నియంత్రణ కేంద్రం (ఎన్‌సీడీసీ) ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు జీనోమ్ సీక్వెన్సింగ్ జరుగుతోంది. ఇందులో భాగంగా మార్చి రెండు, నాలుగు వారాల్లో ఢిల్లీలో కరోనా సోకిన వారి నమూనాలకు పరిశీలించారు.
రెండో వారంలో చేపట్టిన నమూనాల్లో 28శాతం యూకే వేరియంట్ బయటపడగా..అదే నెల చివరి వారంలో అవి 50శాతానికి పెరిగాయని ఎన్‌సీడీసీ డైరెక్టర్ సుజీత్ సింగ్ వెల్లడించారు. దీంతో ఢిల్లీలో వైరస్ విలయతాండవానికి యూకే వేరియంట్ కారణమై ఉండవచ్చని భావిస్తున్నామన్నారు. ముఖ్యంగా పంజాబ్‌లో బ్రిటన్ రకం వైరస్ ప్రభావమే అత్యధికంగా ఉందంటున్నారు. ఢిల్లీలో ఇప్పటివరకు 15వేల నమూనాలకు జీనోమ్ సీక్వెన్సింగ్ చేశారు. వీటిలో ప్రస్తుతం రెండు రకాల కరోనా వేరియంట్‌లను గుర్తించారు. మహారాష్ట్రలో వెలుగుచూసిన B.1.617 వేరియంట్‌నే డబుల్ మ్యుటేషన్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే, సెకండ్ వేవ్ ఉద్ధృతి కొనసాగుతున్న చాలా నగరాల్లో ఈ రకం వేరియంట్ కేసులే 50శాతం వెలుగుచూస్తున్నట్లు తెలుస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com