కర్ణాటక బీజేపీలో టికెట్ల రగడ.. హైకమాండ్‌కు శట్టర్ హెచ్చరికలు

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ.. బీజేపీలో టికెట్ల రగడ నానాటికీ ముదురుతోంది. అటు మాజీ సీఎం జగదీశ్ శెట్టర్ అభ్యర్థిత్వంపై పార్టీ ఇంకా నిర్ణయం తీసుకోకపోవడంతో అసమ్మతిని పెంచుతోంది. ఈ నేపథ్యంలో శెట్టర్.. మరోసారి బీజేపీ హైకమాండ్‌కు హెచ్చరికలు చేశారు. తనకు టికెట్ ఇవ్వకపోతే.. వచ్చే ఎన్నికల్లో పార్టీ కనీసం 20-25 సీట్లను కోల్పోవాల్సి వస్తుందన్నారు.
బీజేపీ ఇప్పటివరకు రెండు విడతల్లో అభ్యర్థుల జాబితాను విడుదల చేయగా.. ఇంకా 12 స్థానాలకు అభ్యర్థులను కేటాయించలేదు. ఇందులో మాజీ సీఎం శెట్టర్ పోటీ చేయాలని భావిస్తున్న హుబ్బళి-ధార్వాడ్ నియోజకవర్గం కూడా ఉంది. ఈ నేపథ్యంలో తనకు టికెట్ కేటాయింపు అంశంపై ఇప్పటికే ఢిల్లీ వెళ్లిన శెట్టర్ .. బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశమయ్యారు. అయినప్పటికీ పార్టీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ ఇప్పటికే 212 స్థానాలకు అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. మిగతా 12 స్థానాలకు అభ్యర్థులను కేటాయించాల్సి ఉంది. అయితే ఈ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు, సీనియర్లను పక్కనబెట్టి కొత్తవారికి అవకాశం ఇవ్వడం పార్టీలో అసమ్మతి రాజేసింది. ఇప్పటికే కీలక నేత లక్ష్మణ్ సవది సహా పలువురు ఎమ్మెల్యేలు పార్టీని వీడారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com