మరోసారి చర్చనీయాంశమైన ఒకే దేశం-ఒకే ఎన్నిక నినాదం

ఒకే దేశం-ఒకే ఎన్నిక నినాదం మరోసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. గురువారం రాజ్యాంగ వార్షికోత్సవం సందర్భంగా గుజరాత్‌లో జరిగిన శాసన వ్యవహారాల ప్రిసైడింగ్ ఆఫీసర్ల సదస్సులో ప్రధాని మోదీ జమిలి ఎన్నికల గురించి ప్రస్తావించారు. వేర్వేరు చోట్ల కొన్ని నెలలకొకసారి ఎన్నికలు జరుగుతుండడం అభివృద్ధి పనులపై ప్రభావం చూపుతాయన్నది అందిరికీ తెలిసిన విషయమే అని.. ఈ సమస్యపై లోతైన అధ్యయనంతో పాటు చర్చించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
కేవలం ఇది చర్చించే విషయం మాత్రమే కాదని, భారత్‌కు ఎంతో అవసరమని మోదీ తెలిపారు. కొన్ని నెలల వ్యవధిలోనే పదే పదే ఎన్నికలు నిర్వహించడం అభివృద్ధికి కూడా ఆటంకం కలిగిస్తాయని పునరుద్ఘాటించారు. అందుకే వాటిని ఒకేసారి నిర్వహించడంపై దృష్టి సారించాలని సూచించారు. దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోవాలంటే జమిలి ఎన్నికలు జరగాలని తెలిపారు.
అంతేకాకుండా, ప్రస్తుతం వివిధ ఎన్నికలకు వేర్వేరు ఓటరు జాబితాలున్నాయని.. వీటికోసం ధనం, సమయం ఎందుకు వృథా చేసుకోవడం ఎందుకుని ప్రశ్నించారు. ప్రస్తుత కాలంలో వేర్వేరు ఓటరు జాబితాలు అవసరం లేదని అభిప్రాయపడ్డారు. అందుకే లోక్‌సభ, అసెంబ్లీ నుంచి పంచాయతీ ఎన్నికల వరకు అన్నింటికీ ఒకటే ఓటరు జాబితా ఉండాలని ప్రిసైడింగ్ అధికారులకు మోదీ సూచించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com