Jammu: ప్రియుడి చేతిలో హత్యకు గురైన వైద్యురాలు...

Jammu: ప్రియుడి చేతిలో హత్యకు గురైన వైద్యురాలు...
ప్రియురాలిని పొడిచి, తానూ ఆత్మహత్య చేసుకోబోయిన దుండగుడు

జమ్మూలో ఓ దంతవైద్యురాలు ప్రియుడి చేతిలోనే దారుణ హత్యకు గురైంది. ఓ అంశంపై వాగ్వివాదం చోటుచేసుకోవడంతో కోపోద్రిక్తుడైన ప్రియుడు ఆమెపై కత్తితో దాడి చేసి హతమార్చినట్లు తెలుస్తోంది. అనంతరం అతడూ ఆత్మహత్యకు యత్నించాడు. వివరాల్లోకి వెళితే... జమ్మూలోని తల్లాబ్ టిల్లోకు చెందిన సుమేధా శర్మ, పాంపోష్ కాలనీకి చెందిన జోహార్ గానాయ్ స్థానిక వైద్య కళాశాలలో బీడీఎస్ చదువుతున్న నాటి నుంచే ప్రేమించుకుంటున్నారు. అనంతరం సుమేధా ఎండీఎస్ చదివేందుకు వేరే ప్రాంతానికి వెళ్లిపోయింది. ఇటీవలే హోలీ పురస్కరించుకుని సొంతూరుకు వచ్చిన సుమేధా తన ప్రియుడిని కలిసేందుకు అతడి ఇంటికి వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే ఏదో విషయమై ఇద్దరి మధ్యా వాగ్వివాదం చోటుచేసుకోగా కోపోద్రిక్తుడైన జోహార్ వంటగదిలోని కత్తితో ఆమెను పలుమార్లు పొడిచినట్లు తెలుస్తోంది. అనంతరం అదే కత్తితో తనని తాను పొడుచుకుని ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. అయితే తాను ఆత్మహత్య చేసుకోబోతున్న విషయాన్ని ఫేస్ బుక్ లో పోస్ట్ చేయడంతో అది చూసిన జోహార్ బంధువు ఒకరు పోలీసులకు సమాచారం అందించారు. అప్రమత్తమైన పోలీసులు జానీపూర్ లో జోహార్ ఇంటికి వెళ్లగా మెయిన్ గేట్ కు తాళం వేసి ఉంది. అయితే తాళం పగలగొట్టి లోపలికి వెళ్లగా అప్పటికే సుమేధ రక్తపుమడుగులో పడిఉందని తెలుస్తోంది. జోహార్ ఉదరభాగంలో గాయాలతో పడి ఉన్నాడు. ఇద్దరినీ ఆసుపత్రికి తరలించగా, సుమేథ అప్పటికే మరణించిందని వైద్యులు ధృవీకరించారు. జోహార్ పరిస్థితి క్లిష్టంగా ఉందని తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story