జనతా కర్ఫ్యూ విధించి నేటికి ఏడాది పూర్తి

ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారి.. మన దేశంలో వ్యాప్తించకుండా అడ్డుకునేందుకు జనతా కర్ఫ్యూతో తొలి అడుగు వేసి నేటికి సరిగ్గా ఏడాది పూర్తయ్యింది. ఏడాది క్రితం కరోనా మహమ్మారి ఎలా వ్యాపిస్తుందో తెలియదు. ఎంత ప్రభావం చూపుతుందో తెలియదు. మందుల్లేవు. వైద్యం అసలే తెలియదు. కానీ.. ఒక్కటే దృఢ సంకల్పం. ప్రజలను కాపాడుకోవాలనే తపన. ఇలాంటి తరుణంలో ఉన్న ఏకైక మార్గం జనతా కర్ఫ్యూ.. లాక్‌డౌన్. కేంద్రం ఇవే అస్త్రాలను ప్రయోగించింది. విధానాలు రూపకల్పన చేసే వరకు, పక్కా ప్రణాళి రూపొందించే వరకు ప్రజలు మహమ్మారి బారిన పడకుండా ఉండాలనే లక్ష్యంతో కర్ఫ్యూ నిర్ణయం తీసుకున్న కేంద్రానికి.... యావత్ దేశం మద్దతిచ్చింది. అన్ని రాష్ట్రాలు కఠిన నిబంధనలు పాటించడంతో కరోనా మహమ్మారి పంజా నుంచి కాస్త ఊరట లభించింది.
దేశవ్యాప్తంగా ఇప్పటివరకు కోటీ 15 లక్షల 99 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు కాగా, లక్షా 59 వేల 790 మంది ప్రాణాలు కోల్పోయారు. తెలంగాణలోనూ ఈ వైరస్ మహమ్మారితో 16 వందల 69 మంది మృతిచెందారు. వైరస్ వ్యాప్తి చెందిన మొదట్లో చికిత్సా విధానం, వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయడంలో అవగాహన లేకపోవడంతో ఎంతో మంది కరోనా బారిన పడి ప్రాణాలు విడిచారు. లాక్‌డౌన్‌తో వైరస్ వ్యాప్తికి కొంతవరకు అడ్డుకట్ట వేసిన కేంద్రం.. ఆ సమయంలో అప్పటివరకు లేని వైద్య సామగ్రి, సదుపాయాలను సమకూర్చుకోవడంపై దృష్టి సారించి.. కరోనాతో అవస్థలు పడుతున్న ప్రజలకు అండగా నిలిచింది.
దేశంలో తొలి కరోనా కేసు కేరళలోని త్రిస్సూర్‌లో జనవరి 30న నమోదు కాగా.. జూలై 30 నాటికి 54 వేల కేసులు నమోదయ్యాయి. ఈ వృద్ధి ఇలాగే కొనసాగి సెప్టెంబర్ 11న అత్యధికంగా 97 వేల 654 కేసులు రికార్డయ్యాయి. సెప్టెంబర్ 30 వరకు ఈ వృద్ధి కొనసాగింది. ఈ క్రమంలో తీసుకున్న చర్యలు, ప్రజలకు వైరస్ పట్ల అవగాహన పెరగడంతో మహమ్మారి వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. కరోనాను అడ్డునేందుకు విధించిన కర్ఫ్యూ సఫలికృతమైంది.
అయితే కర్ఫ్యూ విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ అందరి కంటే ముందే అప్రమత్తమయ్యారు. దేశంలో లాక్‌డౌన్ విధించే కంటే ఒక రోజు ముందే తెలంగాణలో లాక్‌డౌన్ ప్రకటించారు. దేశ వ్యాప్తంగా మార్చి 22న జనతా కర్ఫ్యూ విధించగా.. తెలంగాణలో మార్చి 23న లాక్‌డౌన్ విధించారు. ఒక రోజు తర్వాత 25న దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ మొదలైంది. తెలంగాణ వైరస్ కట్టడికి చర్యలు పకడ్బందీగా అమలయ్యేలా సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ వహించారు. సంబంధిత మంత్రులు, ఉన్నతాధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ వ్యాప్తికి అడ్డుకట్టవేశారు. వైరస్ బారిన పడ్డవారికి చికిత్స అందించేందుకు ప్రత్యేకంగా గాంధీ, ఆ తర్వాత టిమ్స్ ఆస్పత్రులను సిద్ధంచేశారు. టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీటింగ్ విధానాన్ని పకడ్బందీగా అమలుచేయడంతోపాటు పాజిటివ్‌గా నిర్ధారణ అయినవారికి కరోనా కిట్లను అందించారు. ఇంట్లో ఉంటూనే చికిత్స తీసుకొనేవారి కోసం ప్రత్యేకంగా టోల్‌ఫ్రీ నంబర్ ఏర్పాటుచేసి అనునిత్యం వైద్యులు అండగా నిలిచారు.
ఇదిలా ఉంటే ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి మధ్య వరకు తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు ఇప్పుడు దేశవ్యాప్తంగా పెరగడం ఆందోళన కలిగిస్తుంది. ప్రతిరోజు నమోదవుతున్న పాజిటివ్ కేసులు 50 వేల సమీపానికి చేరుకోవడంతో రాష్ట్రాలు అప్రమత్తమవుతున్నాయి. మహారాష్ట్ర, తమిళనాడు, పంజాబ్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, గుజరాత్, కర్ణాటక, హర్యానా రాష్ట్రాల్లో వైరస్ తీవ్రత అధికంగా ఉన్నట్టు కేంద్రం ప్రకటించింది. దేశంలో నమోదవుతున్న కేసుల్లో 80 శాతానికి పైగా ఈ రాష్ర్టాల్లోనే ఉన్నట్టు స్పష్టంచేసింది. దీంతో ఆయా రాష్ట్రాలు ఆంక్షలను కఠినతరం చేయడంతోపాటు, పాఠశాలలు, ఆఫీసులు, థియేటర్లలో పరిమితి వరకే అనుమతిస్తున్నారు. ఇక దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కూడా వేగవంతంగా జరుగుతుంది. రెండో దశ వ్యాక్సినేషన్‌లో 60 ఏళ్లు పైబడినవారు, 45 నుంచి 59 ఏళ్ల దీర్ఘకాలిక రోగులకు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది.
ఈ ఏడాది కాలంలో పారిశుద్ధ్యం, మున్సిపాలిటీ, పంచాయతీ, రెవెన్యూ, పోలీసు, వైద్యారోగ్యం.. ఇలా అనేక శాఖల అధికారులు, సిబ్బంది ఎంతో సమన్వయంతో పనిచేస్తున్నారు. ఇప్పటికీ అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. జర్నలిస్టులు, గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఎందరో కరోనా కష్టకాలంలో బాధ్యతలు నిర్వర్తించారు. వైరస్ నుంచి ప్రజలను కాపాడేందుకు ప్రభుత్వానికి సహకారం అందించారు. ఈ క్రమంలో అందరికంటే ముందుండి పోరాడుతున్న వైద్యారోగ్య సిబ్బంది సేవలు అమూల్యం. కుటుంబాలకు దూరంగా ఉంటూ, ప్రాణాలకు తెగించి వైద్యులు చేసిన కృషికి యావత్ ప్రపంచం సలాం చేసింది. కరోనా పోరులో ఎంతో మంది వైద్యులు, ఇతర సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com