దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్ ఎగ్జామ్‌ ప్రారంభం

దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్ ఎగ్జామ్‌ ప్రారంభం
దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్‌ ఎగ్జామ్స్‌ ప్రారంభమైయ్యాయి. ఇవాళ్టి నుంచి 6 తేదీ వరకు జేఈఈ మెయిన్‌ పరీక్షలను నిర్వహించేందుకు..

దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్‌ ఎగ్జామ్స్‌ ప్రారంభమైయ్యాయి. ఇవాళ్టి నుంచి 6 తేదీ వరకు జేఈఈ మెయిన్‌ పరీక్షలను నిర్వహించేందుకు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మొదటి రోజు బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌లో ప్రవేశాల కోసం జేఈఈ మెయిన్‌ను, 2 నుంచి 6వ వరకు బీటెక్‌, బీఈ ప్రవేశాల కోసం జేఈఈ మెయిన్‌ను నిర్వహించేలా చర్యలు చేపట్టింది. ఉదయం 9గంటల నుంచి 12 వరకు, మధ్యాహ్నం 3గంటల నుంచి 6 వరకు ఇలా రెండు విడతలుగా పరీక్షలు నిర్వహిస్తారు. దేశవ్యాప్తంగా 660 కేంద్రాల్లో నిర్వహించే ఈ పరీక్షలకు 8 లక్షల 58వేల 273 మంది హాజరుకానున్నారు. కరోనా విజృంభణతో పరీక్షలను వాయిదా వేయాలంటూ పలు రాష్ట్రప్రభుత్వాలతో పాటు.. ప్రతిపక్షాలు కొద్ది రోజులుగా డిమాండ్‌ చేస్తున్నప్పటికీ.. షెడ్యూల్‌ ప్రకారమే జరగనున్నాయి. కరోనా నిబంధనలు పాటిస్తూనే పరీక్షలకు ఏర్పాట్లు పూర్తిచేశామని జాతీయ పరీక్షల నిర్వహణ సంస్థ తెలిపింది. కరోనా లక్షణాలు ఉన్న విద్యార్ధులకు ప్రత్యేక గదిని కేటాయించనున్నారు. విద్యార్థులు పరీక్షా కేంద్రంలోకి ప్రవేశించే ముందు.. థర్మల్‌ స్క్రీనింగ్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు. విదేశీ విద్యార్ధుల కోసం.. యుఏఈ, సింగపూర్‌, కువైత్‌, ఒమన్‌, నేపాల్‌, ఖతర్‌, శ్రీలంకలో 8పరీక్ష కేంద్రాలు ఏర్పాటుచేశారు.

తెలంగాణలో 67వేల 319 మంది విద్యార్థులు జేఈఈ మెయిన్‌ ఎగ్జామ్స్‌ రాయనున్నారు. రాష్ట్రంలో 27 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈసారి హైదరాబాద్‌, సికింద్రాబాద్‌తో పాటు వరంగల్‌, కరీంనగర్‌, ఖమ్మం, మహబూబ్‌నగర్‌, నల్గొండ జిల్లాల కేంద్రాలు, వాటి పరిధుల్లోని ద్వితీయ శ్రేణి నగరాల్లో కేంద్రాలు ఏర్పాటుచేశారు. కరోనా నేపథ్యంలో కేంద్రాల్లో విద్యార్థుల సంఖ్యను తగ్గించేందుకు ఈసారి పరీక్షల నిర్వహణను 6 రోజులు, 12 షిఫ్టులకు పెంచారు.

ఏపీలో జేఈఈ మెయిన్‌ ఎగ్జామ్‌లకు 82వేల 748 మంది హాజరుకానున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 52పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా గతంలో కేంద్రాల సంఖ్య 570 ఉండగా.. ఇప్పుడు 660కి చేరింది. గతంలో విద్యార్థుల సంఖ్య షిఫ్టుకు 1.32 లక్షలు ఉండగా.. పెంచిన కేంద్రాలతో 85వేలకు తగ్గింది. కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష విధానంలో జేఈఈ మెయిన్‌ను నిర్వహిస్తున్నారు. ఉదయం షిఫ్టులో విద్యార్థి వినియోగించిన కంప్యూటర్‌ను సాయంత్రం షిఫ్టులో వాడటం లేదని ఎన్‌టీఏ వర్గాలు తెలిపాయి. ఒకసారి వినియోగించిన కంప్యూటర్‌, కీబోర్డ్‌, మౌస్‌, వెబ్‌క్యాం, డెస్క్‌, కూర్చునే మొత్తం ప్రదేశాన్ని సానిటైజ్‌ చేస్తారు. మాస్కులు కేంద్రాల్లోనే అందించనున్నారు. అరగంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని నిబంధన పెట్టారు. హాల్‌టికెట్‌తోపాటు ఏదేని గుర్తింపు కార్డు, పాస్‌పోర్టు సైజు ఫొటో కచ్చితంగా వెంట తెచ్చుకోవాలని ఎన్‌టీఏ సూచించింది. ఈ పరీక్షల ఫలితాలను ఈ నెల 11న విడుదల చేయనున్నట్లు ఎన్‌టీఏ వర్గాలు వెల్లడించాయి. దీంతో 12వ తేదీ నుంచి జేఈఈ అడ్వాన్స్‌డ్‌ రిజిస్ట్రేషన్లను ఐఐటీ ఢిల్లీ ప్రారంభించనుంది.

Tags

Read MoreRead Less
Next Story