Gyanavapi : జ్ఞానవాపి మసీదు-గుడి వివాదం.. ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ

Gyanavapi :  జ్ఞానవాపి మసీదు-గుడి వివాదం.. ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ
Gyanavapi : వారణాసిలోని జ్ఞానవాపి మసీదు, హిందూ టెంపుల్ వివాదం దేశవ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారింది.

Gyanavapi : వారణాసిలోని జ్ఞానవాపి మసీదు, హిందూ టెంపుల్ వివాదం దేశవ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారింది. జ్ఞానవాపి సర్వే రిపోర్ట్ మరింత ఆసక్తికరంగా మారింది. మసీదులో వీడియోగ్రఫీ సర్వే చేసిన అజయ్ మిశ్రా కమిటీ నివేదికలో సంచలన విషయాలు బయటపడ్డాయి. జ్ఞానవాపిలో శేషనాగు శిల్పం సహా హిందూ దేవతలకు సంబంధించిన దేవతా విగ్రహాలు, ఇతర నిర్మాణాలు కనిపించినట్లు కమిటీ పేర్కొంది. దీంతో ఇవాళ సుప్రీంకోర్టులో జరిగే విచారణపై సర్వత్రా ఆసక్తి రేపుతోంది.

జ్ఞానవాపి మసీదు-ఆలయ వివాదం మరింత ముదురుతున్న వేళ మరో కీలక మలుపు చోటుచేసుకుంది. వారణాసి కోర్టు విచారణకు సుప్రీంకోర్టు బ్రేకులు వేసింది. జ్ఞానవాపి మసీదులో శివలింగం ఉందంటూ పలువురు వారణాసి కోర్టును ఆశ్రయించారు. దీనిపై కమిటీ ఏర్పాటు చేసిన న్యాయస్థానం సర్వే చేయాలని ఆదేశించింది. దీంతో మసీదులో వీడియోగ్రఫీ సర్వే నివేదికను మాజీ కోర్ట్ అడ్వోకేట్ కమిషనర్ అజయ్ మిశ్రా కమిటీ రెండు విడతలుగా వారణాసి కోర్టుకు సమర్పించారు. మాజీ అడ్వకేట్ కమిషనర్ అజయ్ మిశ్రా ఈనెల 6, 7 తేదీల్లో జరిగిన వీడియోగ్రఫీ సర్వే నివేదికలో ఆసక్తికర, మరిన్ని సంచలన విషయాలు బయటపడ్డాయి. ఇటీవల మసీదులో శివలింగాన్ని గుర్తించినట్లు వార్తలు రాగా.. తాజాగా జ్ఞానవాపి మసీదులో శేషనాగు శిల్పం సహా హిందూ దేవతలకు సంబంధించిన దేవతా విగ్రహాలు, ఇతర నిర్మాణాలు కనిపించినట్లు తొలి నివేదికలో అజయ్ మిశ్రా వెల్లడించారు. రాతి శిల్పాలతో పాటు కమలం నమూనా, సింధూరి గుర్తులతో నాలుగు విగ్రహాలు గుర్తించినట్లు నివేదికలో పేర్కొన్నారు.

మరోవైపు వివాదాస్పద స్థలంలో బారికేడ్లు పెట్టిన బాహ్య ప్రాంతంలో శృంగార్ గౌరీదేవీ మందిరం, దేవతామూర్తుల ఆనవాళ్లు ఉన్నాయని అజయ్‌ మిశ్రా కమిటీ తన నివేదికలో పేర్కొన్నారు. అలాగే దీపాలు వెలిగించే ఏర్పాట్లు అక్కడ ఉన్నట్లు తెలిపారు. శిలా నిర్మాణాలపై సిమెంట్‌తో నిర్మించిన కొత్త కట్టడాలు నిర్మించారని వెల్లడించారు. సర్వే జరిపిన లోపలి, బయట ప్రాంతాల్లో పురాతన చారిత్రక ఖండాల అవశేషాలున్నట్లు గుర్తించామని అజయ్ మిశ్రా కమిటీ నివేదికలో తెలిపారు. అటు ఈనెల 14, 15, 16 తేదీల్లో మసీదులో జరిగిన సర్వే వివరాలను కూడా రెండో నివేదికగా స్పెషల్ కోర్టు కమిషనర్ విశాఖ సింగ్ వారణాసి కోర్టుకు సమర్పించారు. ప్రార్థనా మందిరంలో తీసిన 15 వందల ఫొటోలు, 10 గంటల నిడివి గల సర్వే వీడియోను కోర్టుకు అందజేశారు. మరోవైపు మసీదులో మరిన్ని హిందూ దేవతా విగ్రహాలు ఉన్నట్లు నివేదికలు పేర్కొనడం పట్ల తమలో ఆత్మవిశ్వాసం పెంచుతోందని హిందూ సంఘాలు అంటున్నాయి.

జ్ఞానవాపిలో శివలింగం, దేవతా విగ్రహాలు బయటపడటంతో ఇక్కడ ఒకప్పుడు ఆలయం ఉండేదా..? అనే అనుమానాలు కలుగుతున్నాయి. జ్ఞానవాపి మసీదు వెనుక పూర్వం ఆలయం ఉండేదని ఇక్కడ పూజలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని హిందూ సంఘాలు, ఐదుగురు మహిళలు వారణాసి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసును విచారించిన కోర్టు.. వీడియోగ్రఫీ సర్వే చేసేందుకు అనుమతి ఇచ్చింది. అయితే వీడియో సర్వే చేస్తుండగా జ్ఞానవాపి బావిలో శివలింగం బయటపడింది. దీంతో ఇక్కడ ఒకప్పుడు శివాలయం ఉండేదన్న వాదనలకు బలం చేకూరుతోంది. ప్రస్తుతం జ్ఞానవాపి వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరగా.. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు అత్యున్నత న్యాయస్థానం విచారణ చేపట్టనుంది.

Tags

Read MoreRead Less
Next Story