Justice NV Ramana: ఎవరి మీదో నెపం వేయాలని అనుకుంటున్నప్పుడు మేం చేసేది ఏముంది.?-ఎన్వీ రమణ

Justice NV Ramana: ప్రధాని మోడీ పంజాబ్ పర్యటనలో ఎదురైన భద్రతా వైఫల్యాలపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ముందు వాదనలు జరిగాయి. ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం.. దర్యాప్తునకు ఐదుగురు సభ్యులతో కమిటీని నియమించింది. ఈ కమిటీకి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి నేతృత్వం వహిస్తారు. ఛండీగఢ్ డీజీపీ, పంజాబ్ అడిషన్ డీజీపీ, పంజాబ్-హర్యానా హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌తో పాటు ఎన్‌ఐఏ ఐజీ ఈ కమిటీలో ఉంటారు.
కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. పంజాబ్ డీజీ, చీఫ్ సెక్రటరీకి ఇప్పటికే షోకాజ్ నోటీసులు జారీ చేశామని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఎస్పీజీ బ్లూబుక్ నిబంధనలను కోర్టు ముందుంచారు. నిబంధనలు తూచా తప్పకుండా అమలు చేయాల్సిన బాధ్యత పంజాబ్ డీజీపీదే అన్నారు. ఆ రాష్ట్ర ఇంటెలిజెన్స్ వైఫల్యం కూడా ఉందని వాదించారు.
అటు పంజాబ్ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది, అడ్వకేట్ జనరల్ డీఎస్ పట్వాలియా వాదనలు వినిపించారు. ఇప్పటికే సంబంధింత అన్ని రికార్డ్స్‌ను పంజాబ్-హర్యానా హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్.. తన కస్టడీకి తీసుకున్నారని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. కేంద్రం చేస్తున్న దర్యాప్తుపై తమకు నమ్మకం లేదని.. దీనిపై స్వంత్ర్య దర్యాప్తును కోరుతున్నామని అన్నారు.
వాదనల సమయంలో సుప్రీంకోర్టు ధర్మాసనం.. కేంద్రం తీరుపై అభ్యంతరం వ్యక్తం చేసింది. భద్రతా వైఫల్యం వాస్తవం, పంజాబ్ కూడా దీన్ని ఒప్పుకోవాల్సిందే.. అయితే జరుగుతున్న విషయాలు సందేహాస్పదంగా ఉన్నాయని న్యాయమూర్తులు సూర్యకాంత్, హిమాకోహ్లీ అన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చాక కూడా షోకాజ్ నోటీసులకు సమాధానం ఇవ్వమని పంజాబ్ అధికారులను కోరడం ఏంటని ధర్మాసనం ప్రశ్నించింది.
అధికారులపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలనుకుంటున్నప్పుడు.. ఇక కోర్టు చేయాల్సింది ఏముందని చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ప్రశ్నించారు. ఎవరి మీదో నెపం నెట్టేయాలని అనుకుంటున్నప్పుడు ఇక తాము చేసేది ఏముందని అభ్యంతరం తెలిపారు. సుదీర్ఘ వాదనలు అనంతరం సుప్రీంకోర్టు దర్యాప్తునకు ఉన్నతస్థాయి కమిటీని నియమించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com